కరోనాతో పెళ్లి పరిశ్రమకు అపార నష్టం

24 Jun, 2020 18:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్, దేశంలోని ఐదువేల కోట్ల డాలర్ల ‘పెళ్లి పరిశ్రమ’పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎక్కువ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. నామమాత్రపు ఏర్పాట్లు, పరిమిత కుటుంబ సభ్యులతో కొన్ని పెళ్లిళ్లు తూతూ మంత్రంగా కొనసాగాయి. మరికొన్ని పెళ్ళిళ్లు ఆన్‌లైన్‌ ద్వారా జరిగాయి, జరుగుతున్నాయి.

పర్యవసానంగా పెళ్లిళ్లపై ఆధారపడి సగటు దినసరి కూలీల నుంచి మ్యారేజ్‌ హాళ్ల యజమానులు, ఈవెంట్‌ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, పెళ్లి పందిళ్లను అలంకరించే కళాకారుల వరకు అందరు నష్టపోయారు. ‘కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి వాయిదా పడిన పెళ్లిళ్లు హంగామా లేకుండా నామమాత్రపు ఖర్చులతో జరగవచ్చు. లాక్‌డౌన్‌ సందర్భంగా భౌతిక దూరం పాటించడం ద్వారా కలిగిన వెలితిని పూడ్చుకోవడం కోసం మరింత వైభవంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు ధనిక కుటుంబాలు ప్రయత్నించవచ్చు’ అని ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ సహా దాదాపు 400 మంది పెళ్లి కుమారులు, పెళ్లి కూతుళ్లను కస్టమర్లుగా కలిగిన ‘వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ కంపెనీ’ యజమాని జోసఫ్‌ రాదిక్‌ తెలిపారు.

భారీ ఎత్తున అలంకరించాల్సిన నాలుగు పెళ్లిళ్లు, 50 మంది అతిథులకు పరిమితమైన రెండు చిన్న పెళ్లిళ్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయని టుస్కానీలో జరిగిన అనుష్క శర్మ పెళ్లికి అంగరంగ వైభవంగా అలంకరణలు చేసిన వెడ్డిండ్‌ ప్లానర్‌ దేవికా నారాయణ్‌ తెలిపారు. పెళ్లి కూతురికి కరోనా రావడం వల్ల 50 మంది అతిథులకు పరిమితమైన ఓ పెళ్లి వాయిదా పడగా, సమీప బంధువుల్లో ఒకరికి కరోనా రావడం వల్ల 50 మందికి పరిమితమైన మరో పెళ్లి కూడా వాయిదా పడిందని చెప్పారు. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, ఆ తర్వాత ఏం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. (గుడ్‌న్యూస్‌: మరింత పెరిగిన రికవరీ రేటు)

ఇక ముందు పెళ్లిళ్ల కూడా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంటే తనలాంటి వెడ్డింగ్‌ ప్లానర్స్‌ అవసరమే ఎక్కువ ఉంటుందని, సాధారణ టెంట్‌ సరఫరాదారులకు ఆ అవగాహన ఉండదని దేవిక ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన ఐదువేల కోట్ల డాలర్ల పెళ్లి పరిశ్రమలో కరోనా కారణంగా మూడువేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ఓ అంచనా. (బ్రీతింగ్‌ వ్యాయామంతో వైరస్‌లకు చెక్‌!)

మరిన్ని వార్తలు