అవినీతిపై చర్యలు తీసుకోలేకపోతున్నాం: సీఎం

10 Jun, 2016 20:22 IST|Sakshi
అవినీతిపై చర్యలు తీసుకోలేకపోతున్నాం: సీఎం

ఢిల్లీ ఏసీబీని తమ నియంత్రణలోకి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఏసీబీ మీద నియంత్రణ తమ చేతుల్లో లేదు కాబట్టి కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై తాము చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. 2015 ఫిబ్రవరిలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపై పోరాడామని, ఆ తర్వాతే నరేంద్రమోదీ పారామిలటరీ బలగాలను పంపి మరీ ఏసీబీని తమ అదుపులోకి తీసుకున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఏసీబీ తమ చేతుల్లో లేదు కాబట్టే, వాటర్ ట్యాంకర్ స్కాంపై తాము విచారణకు ఆదేశించలేకపోయాని తెలిపారు. ఇదే వ్యవహారంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా అసెంబ్లీలో బెంచి ఎక్కి నిలబడిన విషయం తెలిసిందే.

అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ కుమ్మక్కు అయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లది భార్యాభర్తల సంబంధం అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిలో ఒకరైన ఓపీ శర్మ సభలో గందరగోళం సృష్టించడం తప్ప మరేమీ చేయరని, అందుకే ఆయనను సస్పెండ్ చేశామని చెప్పారు. ఆప్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రెండు సెషన్ల పాటు ఓపీ శర్మను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

మరిన్ని వార్తలు