గోవును జాతీయ జంతువు చేయాలి: ముస్లిం గురువు

5 Apr, 2017 14:53 IST|Sakshi
గోవును జాతీయ జంతువు చేయాలి: ముస్లిం గురువు

అజ్మీర్: దేశంలో ప్రముఖమైన దర్గాలలో ఒకటైన రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ రెండు వివాదాస్పత అంశాలపై స్పందించారు. ఒకటి బీఫ్ వివాదం, రెండోది ముస్లిం మహిళల సమస్య అయిన ట్రిపుల్ తలాక్. ముస్లింలందరూ గో మాంసాన్ని(బీఫ్) తినడం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఇతర మతస్తుల విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు మత గురువు సూచించారు.

దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరైన అజ్మీర్ ఉర్సు (ఖాజా మొయినుద్దీన్ చిస్తీ వర్దంతి) లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను, తన కుటుంబం ఇక జీవితంలో బీఫ్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంగళవారం ప్రకటించారు. హిందువులకు పవిత్రమైన ఆవును చంపకూడదని.. గో మాంసాన్ని తినడం మానేసి హిందూ సోదరుల మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లింలకు పిలుపునిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గో మాంసాన్ని నిషేధించిన అనంతరం పలు రాష్ట్రాల సీఎంలూ ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు సులువుగా విడాకులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తలాక్ చెప్పడమంటే మహిళల ఆత్మ గౌరవాన్ని తగ్గించడమే అవుతుందన్నారు. తలాక్ చెప్పడం మానేయాలని ముస్లిం భర్తలకు ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇందుకోసం ఖురాన్ ను అడ్డుపెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తలాక్ ను సవాల్ చేస్తూ ముస్లిం మహిళలు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని గుర్తుచేశారు. ఎంతో మంది ముస్లిం మత గురువుల సమక్షంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరడం, తలాక్ పద్ధతికి స్వస్తి చెప్పాలని ముస్లింలకు సూచించడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు