ఢిల్లీని వదలని పొగమంచు

11 Nov, 2017 09:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రోజులైనా ఢిల్లీని పొగమంచు వీడడం లేదు. శనివారం కూడా ఢిల్లీలో వాతావరణం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కొనసాగుతోంది. శనివారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు, అత్యంత ప్రమాదకర విషవాయులు ఆవరించి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఆది, సోమవారాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో పొగమంచు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని పలుప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 450కి పైగానే నమోదైంది.

షాదీపూర్‌లో 455, మందిర్‌ మార్గ్‌లో 464, ఆనంద్‌ విహార్‌ వద్ద 372, పంజాబ్‌భాగ్‌ 473 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీకి సమీప రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో పరిస్థితులు నిన్నటికంటే శనివారం కొంచెం మెరుగయ్యాయి.
 
రాకపోకలకు అంతరాయం
ఉత్తర భారతదేశాన్ని ఆవరించిన పొగమంచుతో రైళ్లు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి చేరుకోవాల్సిన పలు రైళ్లు శనివారం నాడు తీవ్ర ఆలస్యంతో నడుస్తున్నాయి. మొత్తంగా 64 రైళ్లు అలస్యంగా నడుస్తుండడంతో పాటు, 14 రైళ్ల షెడ్యూల్‌ను అధికారులు మార్చారు. తీవ్రమైన పొగమంచు కారణంలో పలు విమాన సర్వీసులు రద్దుకాగా.. కొన్నింటికి సమీప ప్రాంతాలకు మళ్లించారు.

మరిన్ని వార్తలు