వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు

11 Oct, 2018 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్‌లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్‌లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్‌ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్‌ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్‌ సెహ్రావత్‌ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్‌డీఎంసీ కమిషనర్‌ మధుప్‌ వ్యాస్‌.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్‌ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు