కొనసాగుతున్న కర్ఫ్యూ

26 Oct, 2014 22:09 IST|Sakshi

 న్యూఢిల్లీ: నగరంలో ఇటీవల అల్లర్లు చోటుచేసుకొన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకొన్న దాఖలాలు లేవు. దీపావళి పండుగ సందర్భంగా చిన్న విషయమై రెండు వర్గాల పరస్పరం ఘర్షణకు దిగడంతో ఈ ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొన్నది.  ఈ క్రమంలోనే శనివారం మరో ఐదుగురికి తుపాకీ గాయాలైన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం త్రిలోక్‌పురి ప్రాంతంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నదని డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో, ఆ ప్రాంతంలో ప్రజలు గుంపులుగా ఉండరాదని అధికారులు నిషేధ విధించారని చెప్పారు.
 
 శుక్రవారం జరిగిన సంఘటనకు బాధ్యులైన ఇరువర్గాలకు చెందిన 70 మందిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. శనివారం సాయంత్రం మరోసారి జరిగిన ఘటనలో ఐదుమందికి తుపాకీ గాయాలయ్యాయని చెప్పారు. రాళ్లు రువ్వుకోవడంతో 14 మంది ప్రజలు, 13 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. వారంతా నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. త్రిలోక్‌పురి ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీగా మోహరించినట్లు చెప్పారు. 30 పోలీసు వాహనాలు, వాటర్ క్యానన్స్, అల్లర్ల నియంత్రణ వాహనాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు