మహారాష్ట్ర సీఎం సరికొత్త ఎత్తుగడ!

4 Mar, 2017 19:52 IST|Sakshi
మహారాష్ట్ర సీఎం సరికొత్త ఎత్తుగడ!

ముంబై: బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు శివసేన కోసం కొత్త ఎత్తుగడ వేసింది. ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులకు పోటీ చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఈ పదవులకు కాంగ్రెస్, ఎన్సీపీలను శివసేనకు దూరంగా ఉంచేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. మార్చి 8వ తేదీన ముంబై మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది.

శివసేన పార్టీ ఇదివరకే మేయర్, డిప్యూటీ మేయర్ల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. శివసేన ప్రకటించిన మేయర్ అభ్యర్థికి మద్దతిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ శనివారం మీడియాకు వెల్లడించారు. ముంబై మేయర్ పదవికి శివసేన అభ్యర్థిగా మహేందేశ్వర్ బరిలో ఉన్నారు. 'ముంబై ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారు. అందుకే శివసేన, బీజేపీలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అలాగని మేం శివసేనకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రసక్తే లేదని' ఫడ్నవీస్ అన్నారు. ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో శివసేన మద్దతు అవసరమైనందున ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం 227 వార్డులున్న ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82, కాంగ్రెస్‌ 31 సీట్లతో తొలి మూడు స్థానాల్లో నిలవడం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన మరో ముగ్గురు శివసేన తిరుగుబాటు అభ్యర్థులు కూడా తిరిగి పార్టీ గూటికి చేరటంతో శివసేన బలం 87కు పెరిగింది. మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి శివసేన, ఏ ఇతర పార్టీకైనా 114 కార్పొరేటర్ల మద్దతు ఉండాలి.

మరిన్ని వార్తలు