రాహుల్‌కు ‘డిస్లెక్సియా’ ఉందా ?

5 Mar, 2019 17:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘డిస్లెక్సియా’తో బాధ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆరోపించారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని అంతటి మాటతో విమర్శించవచ్చా! అంటూ ట్విట్టర్‌లో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ‘డిస్లెక్సియా’ అంటే ఏమిటీ ? దాని లక్షణాలేమిటీ ? అది దేశంలో ఎంత మందికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ? నిజంగా రాహుల్‌ గాంధీలో ఆ లక్షణాలు ఉన్నాయా? భారత్‌లోని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి 20 శాతం మంది పిల్లలు దీంతో బాధ పడుతున్నారు. భారత దేశంలో పది శాతం మంది పిల్లలు అంటే, మూడున్నర కోట్ల మంది పిల్లలు ఈ లోపంతో బాధ పడుతున్నారు. 

డిస్లెక్సియా అంటే ఏమిటీ ?
ఇది జబ్బు కాదు. నరాలకు సంబంధించి జన్యుపరమైన లోపం. దీనితో బాధ పడుతున్నవారు. సరిగ్గా చదవ లేరు. సరిగ్గా రాయలేరు. సరిగ్గా అర్థం చేసుకోలేరు. పిల్లల్లో పిండం దశలోనే ఈ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కలిగిన వారికి సాధారణ తెలివితేటలు, కొందరిలో ఎక్కువ తెలివితేటలు కూడా ఉంటాయి. స్ట్రోక్‌ వల్ల పెద్ద వాళ్లలో కూడా ఈ నరాల లోపం ఏర్పడుతుంది. దీన్ని ప్రధానంగా ‘లర్నింగ్‌ డిఫికల్టీ ప్రాబ్లమ్‌’గా వైద్యులు వ్యవహరిస్తారు. 

డిస్లెక్సియా లక్షణాలు 
డిస్లెక్సియాతో బాధ పడుతున్న పిల్లలు సరిగ్గా, స్పష్టంగా మాట్లాడలేరు. వారికి ఎక్కువ పదాలు కూడా తెలియవు. చిహ్నాలను, శబ్దాలను డీకోడ్‌ చేయడంతో ఇబ్బంది పడతారు. దీని ప్రభావం కొందరిలో ఒకలాగ, మరి కొందరిలో ఒకలాగా ఉంటుంది. కొందరు ‘డీ’ అనే పదాన్ని ‘బీ’గా గుర్తిస్తే మరి కొందరు ‘బీ’ అనే పదాన్ని ‘డీ’గా గుర్తిస్తారు. ఇంకొందరు ఒకసారి ‘డీ’గాను మరోసారి ‘బీ’గాను గుర్తిస్తారు. అలాగే అర్థం చేసుకుంటారు. అలాగే మాట్లాడుతారు. వీరికి గణాంకాల క్రమం కూడా గుర్తుండదు. అంటే 1,2,3,4,5....వరుస క్రమాన్ని గుర్తించలేదు. లెక్కల్లో తప్పులు చేస్తారు. 

ఎలా నేర్చుకుంటారు ?
ఈ లోపంతో బాధ పడుతున్నవారికి సంప్రదాయబద్ధంగా విద్యను నేర్పితే వారు నేర్చుకోలేరు. అంటే కళంతో కాగితంపై, బలపంతో స్లేట్‌పై రాసి నేర్పితే వారి బుర్రకు ఎక్కదు. అదే ఇసుకలో చేతి వ్రేలుతో రాస్తూ అక్షరాలు నేర్పితే వారు సులువుగా నేర్చుకుంటారు. కళ్లతోని, సైగలతో, శబ్దాలతోని కూడా సులువుగా నేర్చుకుంటారు. పదాల నేపథ్యాన్ని, భాష నేపథ్యాన్ని వివరిస్తే సాధారణ విద్యార్థులకన్నా త్వరగా నేర్చుకుంటారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ...ఇలా భాష పరంగా కూడా పిల్లలు నేర్చుకోవడంలో తేడాలు ఉంటాయి. 

ఏ స్థాయిలో ఉందో, ఎలా గుర్తించాలి ?
ఏ పిల్లల్లో ఇది ఏ స్థాయిలో ఉందో స్క్రీనింగ్‌ చేయడానికి 2015 వరకు భారత్‌లో ఓ పరికరం, లేదా కచ్చితమైన విధానం అంటూ లేదు. ‘నేషనల్‌ బ్రెయిన్‌ రీసర్చ్‌ సెంటర్‌’ 2015లో ‘డిస్లెక్సియా ఆసెస్మెంట్‌ ఇన్‌ లాంగ్వేజ్‌ ఆఫ్‌ ఇండియా’ లేదా క్లుప్తంగా ‘డాలి’ అనే ఓ విధానాన్ని రూపొందించి. హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే ఈ విధానం అమల్లోకి వచ్చింది. సాధారణంగా ఎనిమిదేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య పెరుగుతున్నా కొద్ది క్రమంగా తగ్గిపోతుంది. ఇక రాహుల్‌ గాంధీ ఈ జన్యుపరమైన లోపంతో బాధ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారంటే అది కచ్చితంగా వ్యంగ్యమే అవుతుంది. ఓ ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అంతటి వ్యంగ్యం అవసరమా !?

మరిన్ని వార్తలు