‘రోకో’ అంటే ఇక జైలే

11 Jul, 2014 01:50 IST|Sakshi

బిల్లుకు పంజాబ్ కేబినెట్ ఆమోదం, వచ్చే వారమే అసెంబ్లీకి
 
చండీగఢ్: ఆందోళనల పేరుతో రైళ్లను, రోడ్లపై వాహనాలను అడ్డుకుంటే ఇకపై జైలుశిక్ష, జరిమానా తప్పదని పంజాబ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రైళ్లను, రోడ్లపై వాహనాలను అడ్డుకుని ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే, ఏడాది వరకూ జైలుశిక్ష, రూ. లక్ష వరకూ జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది.

‘ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంస నివారణ బిల్లు-2014‘ పేరుతో ఈ బిల్లును రూపొందించారు. పేలుడు పదార్థాలతో విధ్వంసానికి, నష్టానికి పాల్పడితే రెండేళ్లవరకూ జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధించాలని, బెయిల్‌కు అవకాశంలేని కేసుగా పరిగణించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల పెరిగిన అరాచక సంఘటనలను అరికట్టేందుకు ఈ బిల్లును రూపొందించామని బాదల్ ప్రభుత్వం చెబుతుండగా,  ‘ఇది నిరంకుశమని, పూర్తి ప్రజావ్యతిరేకమ‘ని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజల నిరసనలు, ఆందోళనల అణచివేతకే ఈ చట్టం తెస్తున్నారని విమర్శించింది.

మరిన్ని వార్తలు