ఆ తప్పు చేయను; రూ.2 లక్షల జీతం ఇవ్వండి

24 Jan, 2020 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ : నకిలీ సాఫ్ట్‌వేర్‌తో భారతీయ రైల్వేకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన నిందితుడు హమీద్‌ అష్రఫ్‌ ఓ ‘కొత్త’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. విదేశాల్లో తలదాచుకుంటున్న అష్రఫ్‌ తనపై కేసులు ఎత్తివేసి ఎథికల్‌ హ్యాకర్‌గా నియమించుకోవాలని ఆఫర్‌ ఇచ్చాడు. అందుకోసం నెలకు రూ.2 లక్షలు జీతంగా ఇవ్వాలని రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) డీజీకి విఙ్ఞప్తి చేస్తూ సందేశాలు పంపాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అష్రఫ్‌కు గ్యాంగ్‌లో ఒకరైన గులాం ముస్తాఫా కూడా ఉన్నాడు.
(చదవండి : ‘ఈ–టికెట్‌’ స్కాం బట్టబయలు)

బెయిల్‌పై వచ్చి జంప్‌ అయ్యాడు..
ఐఆర్‌టీసీ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించిన అష్రఫ్‌ దానిని భారీ మొత్తానికి కొందరికి అమ్మేశాడు. ఈ ఉదంతంపై ‘ఆపరేషన్‌ థండర్‌స్టార్మ్‌’ పేరుతో ఆర్‌పీఎఫ్‌ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణంలో కీలకమైన గులాం ముస్తాఫాను అరెస్టు చేసింది. విదేశాలకు పారిపోయిన అష్రఫ్‌ కోసం గాలిస్తోంది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు కేసును ఛేదించిన ఆర్‌పీఎఫ్‌ డీజీ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. మీడియాకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనేపథ్యంలోనే అష్రఫ్‌ కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే, ఐఆర్‌టీసీ ఈ-టికెటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో  ఉన్న లోపాల కారణంగానే తాను.. నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించానని అష్రఫ్‌ చెప్పుకొచ్చాడు. ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో లోపాల్ని గతంలో తాను లేవనెత్తితే పిచ్చోడి మాదిరిగా చూశారని వెల్లడించాడు. తనను శిక్షిస్తే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదని.. మరికొంతమంది నకిలీ సాఫ్ట్‌వేర్‌ రూపొందించి మోసాలకు పాల్పడతారని పేర్కొన్నాడు. ఎథికల్‌ హ్యాకర్‌గా పనిచేసి భారతీయ రైల్వే ఈ-టికెటింగ్‌లో లోపాల్ని సరిచేస్తానని అష్రఫ్‌ సెలవిచ్చాడు. కాగా, 2016లో ఈ-టికెటింగ్‌కు సంబంధించి ఓ కేసులో అరెస్టైన అష్రఫ్‌ బెయిల్‌ పొందాడు. అనంతరం దుబాయ్‌కి జంప్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు