ఇక స్థూల వేతనంపై పీఎఫ్

14 Mar, 2015 01:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్)లో ఉద్యోగుల వాటా ఇకపై మరింత పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం తాను కొత్తగా తీసుకువస్తున్న బిల్లు ముసాయిదాలో స్థూల వేతనం(గ్రాస్ శాలరీ) నుంచి 12శాతం వాటాను పీఎఫ్‌కు జమ చేయాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం మూల వేతనం(బేసిక్ పే), కరవుభత్యం(డీఏ)ల నుంచి మాత్రమే 12శాతాన్ని ఉద్యోగుల వాటాగా, అంతే మొత్తాన్ని యాజమాన్యాల వాటాగా పీఎఫ్‌కు చెల్లిస్తున్నారు. ఇందులో యాజమాన్య వాటా నుంచి  3.67శాతం పీఎఫ్ ఖాతాకు, 8.33శాతం ఉద్యోగుల పింఛన్ నిధికి, 0.5 శాతం డిపాజిట్ లింక్ పథకానికి వెళ్తుంది.

 

అయితే ముసాయిదా బిల్లు ప్రకారం మూలవేతనం, కరవు భత్యంతో పాటు ఉద్యోగికి లభిస్తున్న రకరకాల ఇతర అలవెన్సులన్నీ కలిపి మొత్తం స్థూల వేతనం మీద 12శాతం గణించి పీఎఫ్ వాటాగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే మొత్తాన్ని యాజమాన్యం తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.  యాజమాన్యాలు పీఎఫ్‌కు చెల్లించే తమ వాటాను తగ్గించుకోవటం కోసం ఉద్యోగికి రకరకాల అలవెన్సుల రూపాల్లో వేతనాలను విభజించి చెల్లిస్తున్నాయని, ఇలాంటి వాటిని నిరోధించేందుకే మొత్తం స్థూల వేతనం నుంచే 12శాతం ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను లెక్కించాలని ప్రతిపాదించినట్లు ఈపీఎఫ్‌ఓ ట్రస్టీ విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. దీంతో ఉద్యోగి చేతికి వచ్చే వేతనం కొంత తగ్గినా, పీఎఫ్ వాటా పెరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య ముసాయిదా బిల్లుపై చర్చలు జరుగుతున్నాయని.. ఒక అంగీకారానికి వచ్చిన తరువాత బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువస్తామని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు