కేరళ గవర్నర్‌గా సదాశివం

4 Sep, 2014 02:30 IST|Sakshi
కేరళ గవర్నర్‌గా సదాశివం

న్యూఢిల్లీ: విపక్ష విమర్శలను ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం.. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పళనిస్వామి సదాశివంను బుధవారం కేరళ గవర్నర్‌గా నియమించింది. దీంతో 65 ఏళ్ల సదాశివం ప్రొటోకాల్ ప్రకారం సీజేఐ హోదాకంటే తక్కువదైన గవర్నర్ పదవి చేపట్టనున్న తొలి సీజేఐగా రికార్డులకెక్కారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ పదవిలో నియమితులైన రాజకీయేతర వ్యక్తి కూడా ఆయనే. గతవారం కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.  సదాశివం శుక్రవారం బాధ్యతలు చేపడతారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైరైన సదాశివంను గవర్నర్‌గా నియమించే అంశంపై కాంగ్రెస్ విమర్శించటం తెలిసిందే. ఆయనను గవర్నర్‌గా నియమించొద్దని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, కేరళ బార్ అసోసియేషన్‌లు రాష్ట్రపతిని కోరడమూ విదితమే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేసులో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన  తీర్పునకు ప్రతిఫలంగానే ఈ పదవి కట్టబెట్టారంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మంగళవారం విమర్శించారు. సదాశివంతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఓ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో షాపై రెండో ఎఫ్‌ఐఆర్‌ను గతంలో కొట్టేసింది.   
 
మాట మారుస్తారా?: కాంగ్రెస్
రిటైరైన జడ్జీలు తిరిగి పదవులు చేపట్టొద్దని బీజేపీ నేతలు గడ్కారీ, జైట్లీలు 2012లో చెప్పారని, మోడీ ప్రభుత్వం మాటలు మార్చే ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రతినిధి శోభా ఓజా విమర్శించారు. అయితే మాజీ సీజేఐ గవర్నర్ పదవి చేపట్టొద్దన్న నిషేధమేమీ లేదని పార్టీ నేత మనీశ్ తివారీ అన్నారు.  సదాశివం నిజాయితీని శంకించకూడదని బీజేపీ పేర్కొంది.రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా తన నియమాకం వ్యవహారంలో వస్తున్న విమర్శలను సదాశివం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం  బాగా పనిచేస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు