ఆర్టీసీ ఖజానాకు కన్నం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఖజానాకు కన్నం

Published Mon, Apr 4 2016 1:38 AM

ఆర్టీసీ ఖజానాకు కన్నం

- బస్టాండ్లలోని దుకాణాల కేటాయింపులో హస్తలాఘవం
- కొత్త దుకాణాలు రాకుండా తెరవెనక చక్రం తిప్పుతున్న అధికారులు
- పాత దుకాణదారులతో మిలాఖత్ ఫలితం
- రూ.కోట్లు నష్టపోతున్న రవాణా సంస్థ

 
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీది అంతులేని నష్టాల కథ. తీరని వ్యథ. ఖజానాకు గండి కొడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నది సామాన్యుల బాధ. ఓవైపు అప్పులు.. వాటిపై కొండలా పేరుకుపోతున్న వడ్డీలు.. మరోవైపు రికార్డుస్థాయి నష్టాలు... ఇలాంటి తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు..? రూపా యి ఆదాయం వచ్చే మార్గం కనిపించినా వదిలిపెట్టకుండా వినియోగించుకుంటారు. కానీ రూ.కోట్లు వచ్చే మార్గాన్ని  ఆర్టీసీ అధికారులు మూసేసి సంస్థ ఖజానాను దెబ్బతీస్తున్నారు. బస్టాండ్లలో దుకాణాల అద్దె ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరు. చాలా ప్రాం తాల్లో కొత్త దుకాణాల కేటాయింపు, బస్టాండ్ ఆవరణలోని ఖాళీ స్థలాలను అద్దెకివ్వటం వంటివి జరుగుతున్నాయి. వీటిని టెండర్ల ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఇటీవల బస్టాండ్లలోని ఖాళీ స్థలాల్లో సైకిల్‌స్టాండ్లు, చిన్నచిన్న బడ్డీకొట్లకు ఆర్టీసీ టెండర్లు పిలి చింది. వాటిని సంబంధీకులకు అప్పగించకుండా కొందరు అధికారులు పాత దుకాణదారులతో మిలాఖత్ అయ్యారు.
 
నల్లగొండ జిల్లాలోని ఏడు ముఖ్యమైన బస్టాండ్లలో 45 దుకాణాలకు సరిపడా ఖాళీస్థలాన్ని గుర్తించి జనవరిలో టెండర్లు పిలవగా 87 మంది పాల్గొన్నారు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన 45 మందిని అధికారులు గుర్తించారు. ఈ దుకాణాల ద్వారా సాలీనా ఆర్టీసీ ఖజానాకు రూ.1.20 కోట్లు సమకూరుతుంది. టెండర్లు దక్కించుకున్నవారికి స్థలాలను కేటాయించేం దుకు నల్లగొండ జిల్లా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ అనుమతి కోరారు. 2 నెలలు దాటుతున్నా అతీగతీలేదు. ఇప్పటికే దుకాణాలు నడుపుతున్న కొందరు వ్యాపారులు కొత్తవారు రాకుండా తెరవెనక ఒత్తిడి ప్రారంభించారు. దాని ఫలి తంగానే అనుమతి రాకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నట్టు తెలిసింది. చివరికి ఆ టెండర్లనే రద్దు చేయించే యత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది. నల్లగొండతోపాటు మరికొన్ని జిల్లాల్లోని బస్టాండ్లలోనూ ఇదే తంతు నడుస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల అధికారులు డిమాండ్ లేదనే పేరుతో టెం డర్లూ పిలవటం లేదు. దీన్ని సమీక్షించకపోవటంతో ఆర్టీసీ రూ.కోట్లలో నష్టపోతోంది.
 
అడ్డగోలు వ్యవహారం ఇలా..
బస్టాండ్లలో దుకాణాల కేటాయింపునకు స్పష్టమైన విధివిధానాలున్నాయి. పళ్లు, పళ్లరసాలమ్మేందుకు కేటాయించే దుకాణంలో వేరే వస్తువులు అమ్మకూడదు. కానీ ఒక పేరుతో అద్దెకు దుకాణం తీసుకుని అందులో యథేచ్ఛగా వేరే వస్తువులను కూడా విక్రయిస్తున్నారు. ఒకే దుకాణంలో మూడు, నాలుగు దుకాణాలకు సరిపడా ఇతర రకాల వస్తువులు విక్రయిస్తున్నారు. దీంతో ఇతర వస్తువులకు ఉద్దేశించిన దుకాణాలు ఖాళీగా ఉండి ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. కొంతకాలంగా ప్రభుత్వం ఆర్టీసీని విస్మరించటాన్ని ఆసరా చేసుకుంటున్న అవినీతి అధికారులు సంస్థ ఆదాయాన్ని తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారు.

Advertisement
Advertisement