నడిరోడ్డుపై మహిళల సిగపట్లు

21 Jan, 2019 17:55 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య సోమవారం తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహికి దిగడం కెమెరాకు చిక్కింది. బీజేపీ మహిళా కార్యకర్త, మహిళా పోలీసు పరస్పరం తోసుకోవడం, ముష్టిఘాతాలతో విరుచుకుపడటం వీడియోలో రికార్డైంది. 2011-12 పిప్లీ గ్యాం​గ్‌రేప్‌, హత్య కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నినదించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

పూరి జిల్లా పిప్లీ ప్రాంతంలో 2011, నవంబర్‌ 28న పంతొమ్మిదేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. కటక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012, జూన్‌ 21న బాధితురాలు చనిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ ప్రధాన్‌తో పాటు అతడి తమ్ముడు సుశాంత్‌లను గతేడాది డిసెంబర్‌లో మొదటి అదనపు సెషన్స్ కోర్టు విడుదల చేసింది. ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితులు బయటపడ్డారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్‌ మహారథి తన పదవికి 2012లో రాజీనామా చేశారు. మళ్లీ 2014లో ఆయన మంత్రి పదవిని దక్కించుకున్నారు.



 

మరిన్ని వార్తలు