దీదీకి జై.. అమ్మకు నై?

17 May, 2016 01:56 IST|Sakshi
దీదీకి జై.. అమ్మకు నై?

- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడి
- బెంగాల్‌లో మళ్లీ టీఎంసీకే పట్టం
- తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమి..
- జయలలితకు భంగపాటు..
- కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్‌కే పీఠం
- అస్సాంలో ఎగరనున్న బీజేపీ జెండా
- బెంగాల్ మినహా మిగతా చోట్ల అధికార మార్పు

 
అమ్మకు తమిళనాడు ఓటర్లు బైబై చెప్పి..  సూర్యోదయానికి (డీఎంకే పార్టీ గుర్తు)కు స్వాగతం పలకనున్నారు. తమిళగడ్డపై ‘అధికారాన్ని మార్చే’ సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించనున్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పుదుచ్చేరిలోనూ డీఎంకే-కాంగ్రెస్ కూటమికే మెజారిటీ సీట్లు దక్కనున్నాయి. బీజేపీ తొలిసారి అస్సాంలో అధికారంలోకి రానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మమతకే బెంగాలీలు మద్దతుగా నిలిచారు. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఈసారి పగ్గాలు అందుకోనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది.

న్యూఢిల్లీ: ప్రచారంలో నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ మినహా మిగిలిన చోట్ల అధికార మార్పిడి జరుగుతుందని ఎగ్జిట్‌పోల్ సర్వేలు వెల్లడించాయి. సోమవారం విడుదలైన ఈ సర్వేల ప్రకారం తమిళనాట జయలలితకు ఓటమి తప్పదని, డీఎంకే-కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీని సంపాదిస్తుందని తేలింది. చాలా కాలంగా ఈశాన్య రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ తొలి సారిగా అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలుండగా.. పశ్చిమబెంగాల్‌లో రెండోసారీ మమతకే ప్రజలు పట్టంగట్టనున్నారు. కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారంలోకి రానుందని వెల్లడైంది.
 
కరుణవైపే మొగ్గు
ప్రభుత్వాలను ప్రతి ఐదేళ్లకోసారి మార్చే సంప్రదాయానికే తమిళ ఓటర్లు మరోసారి జై కొట్టారు. తమిళనాడులో (మొత్తం సీట్లు-234) అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లు 118. అయితే..  అధికార అన్నాడీఎంకే 90-100 సీట్ల లోపలే వస్తాయని ఏబీపీ-నీల్సన్, ఇండియాటుడే-యాక్సిస్ సర్వేలు వెల్లడించాయి. ఈ రెండు సర్వేలు డీఎంకే-కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ (132-140) వస్తుందని వెల్లడించాయి. అయితే.. సీ-వోటర్ సర్వే మాత్రం అమ్మ 138 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ మూడు సీట్లు మించి గెలవటం కష్టమని తేలింది. కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి.. జయలలిత ఓట్లను చీల్చి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

ప్రభావం చూపిన అంశాలు: చెన్నై వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. సహాయ కార్యక్రమాలకు కూడా అమ్మ బ్రాండ్ వేసుకోవటంపై బాధితులు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీనికి తోడు అక్రమాస్తుల కేసులో జయలలితపై విమర్శలు, పాలనాపరమైన సమస్యలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడుతోందన్న నిపుణుల ఆరోపణలు తీవ్రమైన ప్రభావం చూపాయి.
 

బీజేపీ ఖాతాలోకి అస్సాం
ఈశాన్యరాష్ట్రాల్లో పాగా వేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. తొలిసారిగా అస్సాంలో జెండా ఎగరవేయనుందని సర్వేలు చెబుతున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)పై తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. ‘అభివృద్ధి మంత్ర’తో ప్రచారం చేసిన బీజేపీ తమ కూటమి సభ్యలైన అసోం గణపరిషత్, బోడో పార్టీలతో కలిసి స్పష్టమైన మెజారిటీ గెలుచుకుంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అస్సాంలో (మొత్తం సీట్లు-126) అధికారానికి 64 సీట్లు అవసరం కాగా, బీజేపీ 80 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 30-35 సీట్లకే పరిమితం కానుంది. గత ఎన్నికల్లో కీలకంగా మారిన ఏఐయూడీఎఫ్ పార్టీ 8-10 సీట్లలో మాత్రమే గెలవనుంది.

ప్రభావం చూపిన అంశాలు: వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై అసంతృప్తి సహజమే. దీనికి తోడు బంగ్లాదేశ్‌నుంచి చొరబాట్లను అడ్డుకోవటంలో గొగోయ్ విఫలం చెందటం వల్లే స్థానికులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనికి తోడు అభివృద్ధి కుంటుపడుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలూ ప్రభావం చూపాయి.
 
మమతపైనే అనురాగం
మూడుదశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతకే మరోసారి అవకాశం ఇవ్వాలని బెంగాల్ ఓటర్లు నిర్ణయించినట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం పనితీరుపై ఎన్ని ఆరోపణలొచ్చినా ప్రజలు మాత్రం స్పష్టమైన తీర్పును ఇచ్చారు. అధికారానికి(మొత్తం సీట్లు-294) 148 సీట్లు అవసరమైన బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి స్పష్టమైన మెజారిటీతో(160-220 స్థానాలొస్తాయని అంచనా) గెలవనుంది. గత ఎన్నికల్లో మమతతో జట్టుకట్టిన కాంగ్రెస్.. ఈసారి లెఫ్ట్ పంచన చేరినా వారు గెలిచేసీట్లలో పెద్దగా మార్పుండకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్-లెఫ్ట్ 120 సీట్ల వరకు గెలవొచ్చని తెలుస్తోంది. చాణక్య, యాక్సిస్ సర్వేలు మాత్రం ఈ కూటమి 60-70 స్థానాలకే పరిమితం కావొచ్చన్నాయి. బీజేపీ  నాలుగైదు స్థానాలు గెలవొచ్చని అంచనా.

ప్రభావం చూపిన అంశాలు: శారద స్కాం, నారద స్టింగ్ ఆపరేషన్‌లలో టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడినట్లు తేలింది. బంగ్లా సరిహద్దు ద్వారా మనుషుల అక్రమరవాణా, మతఘర్షణలు ఎన్ని జరిగినా.. లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిపై నమ్మకం లేకే.. మమతకు పట్టం గట్టినట్లు తెలుస్తోంది.

కేరళలో ఈసారి లెఫ్ట్
గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వామపక్ష ఎల్డీఎఫ్.. ఈసారి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 140 సీట్లున్న కేరళలో అధికారానికి 71 సీట్లు అవసరం ఉండగా.. ఎల్డీఎఫ్ 75-78 స్థానాలు గెలుచుకోనున్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కుంభకోణాలతో తల బొప్పికట్టిన సీఎం ఊమెన్‌చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితం కానుంది. అయితే తొలిసారి బీజేపీ కేరళ అసెంబ్లీలో కాలుపెట్టనుందని తెలుస్తోంది. చాణక్య సర్వే గరిష్టంగా బీజేపీకి 8 సీట్లు రావొచ్చని అంచనా వేయగా ఇతర సర్వేలు మాత్రం 2-4 స్థానాల్లో కమలం గెలవొచ్చంటున్నాయి.

ప్రభావం చూపిన అంశాలు: కేరళలోని యూడీఎఫ్ సర్కారుపై భారీగా అవినీతి ఆరోపణలొచ్చాయి. సీఎం ఊమెన్ చాందీపైనా సోలార్ స్కాం ఆరోపణలు రావటం.. దీనికి తోడు శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం చెందటం అధికార కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణాలయ్యాయి. దీనికి తోడు కాంగ్రెస్ బహిరంగంగానే రెండు గ్రూపులుగా విడిపోవడం కూడా ఎల్డీఎఫ్‌కు కలిసొచ్చింది.
 
పుదుచ్చేరిలోనూ డీఎంకేనే!
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టవచ్చని తెలుస్తోంది. అధికార ఏఐఎన్నార్సీ 8 సీట్లు గెలుస్తుందని అంచనా. 30 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే కూటమి 15-21 సీట్లు, ఏఐఏడీఎంకే 4-5 సీట్లు గెలుస్తుందని సర్వేల్లో తేలింది. సీఎం రంగస్వామి నాయకత్వంలోని అధికార ఏఐఎన్నార్సీపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. చిన్న చిన్న ఆరోపణలతోనే ప్రభుత్వమార్పు జరగనుందని విశ్లేషకుల అంచనా. అయితే తమిళనాడు ప్రభావం ఇక్కడ కూడా ఉండటం కూడా అధికార పార్టీ ఓటమికి కారణం కానుంది.

మరిన్ని వార్తలు