లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలి

27 Mar, 2020 03:31 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేదు..

ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లకూడదు

కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు స్వీకరించా: కిషన్‌రెడ్డి  

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు కఠినం గా అమలు చేయాలని, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘తెలుగు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నాను. ఒక్కరోజే 17 మంది జిల్లా కలెక్టర్లతో మాట్లాడాను. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాను. కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు నాకు అప్పగించడం అదృష్టం. పౌర విమానయానం, పౌర సరఫరాలు, రవాణా విభాగాలు ఎప్పటికప్పుడు ఈ కంట్రోల్‌ రూమ్‌ నుంచి స్పందిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేక ఆంధ్రా–తెలంగాణ సరిహద్దుల్లో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. వేలాది మంది విద్యార్థులు సరిహద్దుల్లో గంటల తరబటి వేచి ఉండటం సరికాదు.

నేను ఉభయ రాష్ట్రాలను కోరుతున్నా. ముఖ్యమంత్రులు, అధికారులు ఈ సమస్య తలెత్తకుండా చూడాలి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలను కూడా ఆదేశించాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోకి ఎవరూ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలు, పోలీసులపై ఉంది. దీన్ని ఉల్లంఘించకూడదు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలి. అలా జరిగితేనే విపత్తు నుంచి బయటపడతాం. ఎవరూ దీనిని తక్కువగా అంచనా వేయకూడదు. బీజేపీ కార్యకర్తలు ఐదు మందికి ఉపయోగపడేలా భోజన ప్యాకెట్లు తయారు చేసి ఆకలితో ఉన్నవారికి అందజేయాలని కోరుతున్నాం. ఎన్జీవోలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. పశు పక్ష్యాదుల ఆకలి తీర్చాలి. కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ ప్రకటించింది. 80 కోట్ల ప్రజలకు ఈ ప్యాకేజీ మేలు చేస్తుంది. కోవిడ్‌–19తో పోరాడుతున్న ఆరోగ్య విభాగాల సిబ్బందికి రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించింది’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు