వెళ్లిరావయ్యా.. గణపయ్యా

9 Sep, 2014 22:43 IST|Sakshi

 సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో గణేష్ చతుర్థి ఉత్సవాలు జరుపుకొన్నారు. 11రోజులపాటు వినాయకుని నామస్మరణ మార్మోగింది.  ‘గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా’ (గణపతి దేవుడా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్య), ‘గణపతి గేల గావాల చైన్ పడేన హమాల’ అనే నినాదాలతో వీధులన్నీ దద్దరిల్లాయి. వినాయకుని ప్రతిమలతో భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించారు. సోమవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వరకు కొనసాగాయి. ముంబైలో సోమవారం ఉదయం గణేష్‌గల్లీలోని ముంబై చా రాజా వినాయకుని శోభాయాత్రతో నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి.

 అనంతరం ప్రసిద్ధి గాంచిన లాల్‌బాగ్ చా రాజా వినాయకుని శోభాయాత్ర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షం కురిసినా భక్తజనం ఊరేగింపుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముంబైలోని గిర్‌గావ్, శివాజీ పార్క్, జుహూ చౌపాటీ తదితర నిమజ్జన ఘాట్ల వద్దకి లక్షలాది మంది భక్తులు వినాయకుడి విగ్రహాలను సాగనంపారు. ఈ సారి ఉగ్రవాదుల హెచ్చరికల  నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.    

 లాల్‌బాగ్ చా రాజా.. భారీ ఊరేగింపు
 నగరంలో సగటున ఐదు నుంచి పది గంటలపాటు నిమజ్జనాల ఊరేగింపులు కొనసాగాయి. ప్రముఖమైన లాల్‌బాగ్ చా రాజా వినాయకుని నిమజ్జన ఊరేగింపు సుమారు 20  గంటలపాటు కొనసాగింది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ  ఊరేగింపు మంగళవారం తెల్లవారుజామున గిర్‌గావ్ చౌపటీకి చేరుకుంది. చౌపటీ వద్ద హారతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు నిమజ్జనం చేశారు.  

 కృత్రిమ జలాశయాల్లో నిమజ్జనాలు
 కృత్రిమ జలాశయాల్లో కూడా భారీ  ఎత్తున నిమజ్జనాలు జరగడం పర్యావరణ ప్రేమికులకు ఆనందం కలిగించింది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బీఎమ్‌సీలు చేస్తున్న ప్రయత్నం  సఫలీకృతమైంది. పుణేలో గణేషోత్సవాలకే తలమానికమైన మొదటి గణపతి ‘కస్బా పేట్’ వినాయకుడితోపాటు ఐదు గణపతుల శోభాయాత్రలు ముందుగా ప్రారంభమయ్యాయి. పుణేలోని డీజే, ఇతర మ్యూజిక్ సిస్టమ్‌తో కాకుండా బ్యాండ్ మేళాలతో సంప్రదాయ బద్దంగా శోభాయాత్రలు జరిగాయి.

ఈ శోభాయాత్రలను లక్షలాది మంది భక్తులు తిలకించి పరవశించిపోయారు. నగరంలో ముంబై పోలీసులకు మద్దతుగా హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌ఆర్‌పీఎస్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని బందోబస్తులో పాల్గొన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా  పలు రోడ్లు మూసివేయడంతోపాటు వన్ వేలు చేయడం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు.

 భాజాభజంత్రీల మధ్య శోభాయాత్రలు
 పింప్రి, న్యూస్‌లైన్ : 11 రోజులపాటు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సోమవారం రంగులు జల్లుకుంటూ గణపతి విగ్రహాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. భాజా భజంత్రీలు, మేళ తాళాలు, డీజే సౌండ్ల మధ్య యువత నత్యాలు హోరెత్తించాయి. అందంగా అలంకరించిన రథాల ముందు భక్తిలు నత్యాలు చేస్తూ పరవశించిపోయారు. శోభాయాత్రలు ఉదయం నుంచే పింప్రి క్యాంప్ నుంచి ప్రారంభ మయ్యాయి. ముందుగా జి.కె.ఎన్. సింధర్ కంపెనీకి చెందిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.   గణేష్‌ల రథాలు పింప్రి బజారు, షగున్ చౌక్ మీదుగా ఊరేగింపుగా సాగాయి.

గణేష్ మండళ్లకు స్వాగతం పలకడానికి పింప్రి చించ్‌వడ్ కార్పొరేషన్ స్వాగత తోరణాలను ఏర్పాటు చేసింది. నగర కమిషనర్ రాజీవ్ జాదవ్, సహాయక కమిషనర్ తానాజీ షిందే, అడ్మినిస్ట్రేషన్ అధికారి అన్నా బోదడే, మాజీ మేయర్ విశ్రాంతి పడలే ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు సుమారు 38 మండళ్ల గణేష్‌లు నిమజ్జనం అయ్యాయి. అర్ధరాత్రికి గణేష్ నిమజ్జనం పూర్తయ్యింది. సుఖేవాని మిత్ర మండలి, మహారాష్ర్ట పంచాయత్ గణేష్ మండలి,  మహారాష్ట్ర తరుణ్ మండల్, అమర్ జ్యోతి గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

శివశక్తి మండలి ఆధ్వర్యంలో రంగురంగుల పూలతో అలంకరించిన రథం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మండలి కార్యకర్తలు వివిధ వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. సింహగర్జన మిత్ర మండలి.. మయూరి (నెమలి) ఆకారంలో రథాన్ని తయారు చేశారు. న్యూగోల్డన్ మిత్ర మండలి, భీంసేన మిత్ర మండలి, అంకుష్ సుర్వే ప్రతిష్టాన్ గణేష్ మిత్ర మండలి వారు చేసిన నత్యాలు భక్తులను ఉత్తేజపర్చారు.  పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

 లోనావాలాలో...
 లోనావాలాలో ప్రతి సారి మాదిరిగానే ఈ సారి కూడా సాయంత్రం 4 గంటల తర్వాత గణేషుణ్ని ఊరేగించారు. మొదట రాయ్‌వుడ్ గణేష్ ఉత్సవ మండలి గణపతి నిమజ్జనం చేశారు. ఆ తర్వాత వరుసగా మానాచా తరుణ్ మిత్ర మండల్, రోహిదాస్ మండల్, శేత్‌కారి-భజన్ మండల్, గవలీ వాడా గణేష్ ఉత్సవ మండలి విగ్రహాలను నిమజ్జనం చేశారు. రాందేవ్ బాబా భక్త మండలి, లయన్స్ క్లబ్ లోనావాలా ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.

జైచంద్ చౌక్ వద్ద లోనావాలా నగర శివసేన ఆధ్వర్యంలో మూడు వేల కిలోక ప్రసాదాన్ని భక్తులకు అందించారు. శివాజీ చౌక్, లోనావాలా నగర పోలీస్టేషన్, లోనావాలా నగర పరిషత్, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, బీజేపీ పార్టీలు, స్వాభిమాని రిపబ్లికన్ పార్టీల స్వాగత తోరణాలు ఆకర్షణగా నిలిచాయి. నగర అధ్యక్షులు అమిత్‌గవలి, ఉప నగర అధ్యక్షులు శకుంతల ఇంగుల్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ గైక్వాడ్, సంత్ తుకారం చక్కర కంపెనీ ఉపాధ్యక్షులు మాధలి దాబాడే, నారాయణ అంబేకర్,  పార్టీ ప్రముఖులు శోభాయాత్రలకు స్వాగతం పలికారు. పోలీసు అధికారుల వైభవ్ కలుబర్మే, ఐ.ఎస్.పాటిల్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.

 భివండి పద్మానగర్‌లో..
 భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో అత్యధిక తెలుగు ప్రజలు నివసించే పద్మానగర్ ప్రాంతంలో బాలాజీ మిత్ర మండల్ ప్రతిష్ఠించిన పద్మానగర్ చా రాజాను వరలా దేవి ఘాట్‌లో ఘనంగా నిమజ్జనం చేశారు. ఉదయం 11 గంటలకు మండపం నుంచి బయలు దేరిన శోభాయాత్ర రాత్రి 10 గంటలకు స్థానిక వరాలదేవి ఘాట్‌కు చేరింది. జై మాతాది మిత్ర మండలి, సాయి శ్రద్ధ మిత్ర మండలి ఆధ్వర్యంలోని విగ్రహాలను రాత్రి 9 గంటలకు నిమజ్ఞనం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి 18 అడుగుల ఎత్తు విగ్రహాలను ప్రతిష్ఠించడం ఈ మండపాలకు ఆనవాయితీగా వస్తోంది.  శోభయాత్రలో  తెలుగు ప్రజలు ఆనందోత్సహాలతో నృత్యాలు చేస్తూ విఘ్నేశ్వరునికి వీడ్కోలు పలికారు.

 ప్రశాంతంగా నిమజ్జన ఉత్సవాలు
 బోరివలి, న్యూస్‌లైన్: బోరివలిలో నిమజ్ఞన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని విపక్ష నేత వినోద్ తావ్డె అన్నారు. ముంబై డిప్యూటీ మేయర్ మోహన్ మీర్ భావ్‌కర్ సోమవారం గోరాయి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచి నీటి సరఫరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన భక్తులకు మంచినీటి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోరివలి నియోజక వర్గం అధ్యక్షుడు మహేష్ రావుత్, శిల్పా మీర్ భావ్‌కర్, పోలెపాక సైదులు  పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు