మార్కెట్లో నకిలీ వెన్న | Sakshi
Sakshi News home page

మార్కెట్లో నకిలీ వెన్న

Published Tue, Sep 9 2014 10:47 PM

Fake butter on the market

సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వెన్న ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది. ఉత్సవాల సమయంలో తీపి పదార్థాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇందులో వెన్న వాడకం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు నాణ్యత లేని, కాలం చెల్లిన, నకిలీ వెన్నను మార్కెట్లోకి సరఫరా చేస్తుంటారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎఫ్‌డీ అధికారులు వ్యాపారులను హెచ్చరించారు. నకిలీ వెన్నతో మిఠాయి తయారు చేసి ప్రజల ప్రాణాలకు హాని చేకూర్చవద్దని సూచించారు. కానీ వ్యాపారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో వస్తున్న నకిలీ వెన్నను కొనుగోలు చేసి మిఠాయి తయారీలో వినియోగిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని తెలిసినా లాభాపేక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

 రాష్ర్టవ్యాప్తంగా దాడులు
 గణేష్ ఉత్సవాల సమయంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్.డీ) శాఖ అధికారులు దాడులు నిర్వహించి 29,688 కేజీల నకిలీ వెన్నను స్వాధీనం చేసుకొన్నారు. ఉత్సవాలు ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనేరూ.13.58 లక్షలు విలువ చేసే 6,048 కేజీల నకిలీ, కుల్లిపోయిన వెన్న పట్టుకున్న విషయం తెలిసిందే.

 ఈ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిపి  భారీగా నకిలీ వెన్నను పట్టుకున్నట్లు ఎఫ్‌డీ పరిపాలన విభాగం కమిషనర్ పురుషోత్తం బాప్కర్ చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.56,04,246 ఉంటుందని చెప్పారు. నకిలీ వెన్నను ముంబై, శివారు ప్రాంతాల నుంచి అత్యధిక శాతం స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. 60 నమూనాలను ప్రయోగ శాలకు పంపించామని నివేదికరాగానే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎఫ్‌డీ నుంచి లెసైన్స్ పొందిన ఆధీకృత షాపుల నుంచి మిఠాయి, వెన్నను కొనుగోలు చేయాలన్నారు.

Advertisement
Advertisement