సీబీఐ ఎంక్వైరీ కోరుతూ పోలీసులపై రాళ్లదాడి

13 Jul, 2017 11:25 IST|Sakshi
సీబీఐ ఎంక్వైరీ కోరుతూ పోలీసులపై రాళ్లదాడి

జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా, 20కి పైగా పోలీసులు గాయపడ్డారు. తమ కుమారుడిని పోలీసులు అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తూ గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఫ్యామిలీ సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. గత జూన్ 24న పోలీసుల ఎన్‌కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్‌ మృతిచెందాడు. అయితే అతడి కుటుంబసభ్యులు ఆనంద్ అంత్యక్రియలు నిర్వహించకుండా.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి భద్రపరిచారు. అప్పటినుంచీ గ్యాంగ్‌స్టర్ తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఆందోళన చేపట్టారు. కర్ఫ్యూ విధించిన నాగౌర్‌తో పాటు బికనీర్ సహా నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

గ్యాంగ్‌స్టర్ ఆనంద్ తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులుకు సమాచారం అందించినా ఉద్దేశపూర్వకంగానే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఇంటికి మృతదేహం తరలించగా అంత్యక్రియలు చేయకుండా ఫ్రీజర్‌లో ఉంచారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. జూన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు, గ్యాంగ్‌స్టర్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.

నాగౌర్‌లో పోలీసులపై రైల్వై స్టేషన్లు, రద్దీ రోడ్లు అంటూ పలు జంక్షన్ల వద్ద రాళ్లదాడికి పాల్పడ్డారని ఓ ఉన్నతాధికారి ఎన్‌ఆర్‌కే రెడ్డి తెలిపారు. మొదట ర్వైల్వే ట్రాక్స్‌ మీద అడ్డుగా ఉండి రాకపోకలకు ఇబ్బంది కలిగించడంతో కొన్ని సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని రైళ్ల రూట్లను మార్చారు. ఆందోళనకారులు చెలరేగి పోలీసులపై రాళ్లదాడికి పాల్పడగా 20 మంది పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

కాగా, గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పై 1992-2017 మధ్యకాలంలో 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరు హత్య కేసులునట్లు పోలీసులు చెబుతున్నారు. జైపూర్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన హత్య కేసుకిగానూ 2012లో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. 2015లో అజ్మీర్‌లో కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి నాటకీయంగా గ్యాంగ్‌స్టర్ ఆనంద్ తప్పించుకున్నాడు. అప్పటినుంచీ అతని కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. మరోవైపు ఏ ఆదాయ వనరు లేకున్నా నిందితుడి పేరిట రెండు అపార్ట్‌మెంట్లు, విలువైన భూములున్నాయని.. ఓ కూతురు దుబాయిలో చదువుకుంటోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు