గోవాపై గురి.. విదేశీ పర్యాటకులే లక్ష్యం!

26 Mar, 2016 09:51 IST|Sakshi
గోవాపై గురి.. విదేశీ పర్యాటకులే లక్ష్యం!

దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురిపెట్టింది. విదేశీ పర్యాటకులే లక్ష్యంగా దాడులు జరుపాలని ఐసిస్‌ భావిస్తోంది. ఇటీవల అరెస్టయిన ఐసిస్‌ సభ్యుల విచారణలో ఈ వివరాలు వెల్లడైనట్టు దర్యాప్తు సంస్థలు తెలిపాయి.

దక్షిణాసియాలో తమ విధేయుల్లో విశ్వాసం కల్పించడానికి, అంతర్జాతీయ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి గోవాను ఐసిస్‌ టార్గెట్ చేసిందని, భారత్‌లోని ఇస్లామిక్ స్టేట్ హిట్‌లిస్ట్‌లో గోవా టాప్‌ స్థానంలో ఉందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా తన ఫైటర్లకు శిక్షణ ఇవ్వడానికి భారత్‌లో మంచి ప్రదేశం కోసం ఐసిస్‌ వెతుకుతున్నట్టు తెలుస్తున్నదని చెప్పాయి. ఐసిస్‌కు చెందిన ఆమిర్‌ ఏ హింద్‌, థానెకు చెందిన ముద్దబీర్‌ ముష్తాక్‌ షైక్‌ ఆఫ్ ముంబ్రా కార్యకర్తలు విదేశీ పర్యాటకులు లక్ష్యంగా గోవాలో బాంబులు పేల్చాలని పథకం రచించినట్టు విచారణలో తెలిపారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో గోవాపై దాడికి ఐసిస్‌ వ్యూహం పన్నింది. డిసెంబర్‌లో యూరప్‌, అమెరికా, రష్యా నుంచి ఎక్కువమంది పర్యాటకులు వస్తారు. అయితే, ఈ దాడులను ముందే పసిగట్టిన నిఘావర్గాలు వాటిని నిరోధించగలిగాయి. గత నాలుగు నెలల్లో వివిధ రాష్ట్రాల్లో ఐసిసి అనుమానితులు 23మందిని భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. ఇందులో హరిద్వార్‌పై దాడికి కుట్రపన్నిన రూర్కీ మాడ్యూల్‌ సభ్యులు ఐదుగురు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు