రాజన్‌బాబు నుంచి నేటి వరకూ

21 Jul, 2017 02:12 IST|Sakshi
రాజన్‌బాబు నుంచి నేటి వరకూ

అత్యధిక ఓట్ల శాతంలో...12వ స్థానం కోవింద్‌ది!
పద్నాలుగో రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏబీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌పోలైన ఓట్లలో 65.65 శాతం ఓట్లు సాధించి, ఇప్పటి వరకూ జరిగిన 14 ఎన్నికల్లో (ఏకగ్రీవమైన 1977 నాటి ఎన్నికను మినహాస్తే) అత్యధిక ఓట్లు పొందినవారి వరుస క్రమంలో 12వ స్థానం సంపాదించారు. భారత రాష్ట్రపతి రెండో ఎన్నిక(1957)లో మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌పోలైన ఓట్లలో 98.99 శాతం సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అత్యధిక ఓట్లు దక్కించుకోవడంలో రెండో ర్యాంక్‌రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు(1962లో 98.24 శాతం) లభించింది. అప్పట్లో ప్రతిపక్షాలకు బలం లేకపోవడమే కాంగ్రెస్‌అభ్యర్థులుకు భారీగా ఓట్లు రావడానికి కారణమైంది.

1997లో జరిగిన ఎన్నికలో కేఆర్‌నారాయణన్‌94.97 శాతం ఓట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు శివసేన వంటి ఒకట్రెండు పార్టీలు మినహా బీజేపీ, కాంగ్రెస్, పాలక యునైటెడ్‌ఫ్రంట్‌సహా దాదాపు అందరూ మద్దతు ఇవ్వడంతో కేఆర్‌కు ఇన్ని ఓట్లుపడ్డాయి. 2002లో జరిగిన ఎన్నికలో వామపక్షాలను మినహాయించి మిగిలిన పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య దాదాపు ఏకాభిప్రాయం కుదరడంతో ఏపీజే అబ్దుల్‌కలాం 89.57 శాతం ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు.

అత్యల్ప మెజారిటీ వి.వి.గిరికే!
ఓ మోస్తరు త్రిముఖ పోటీ 1969లోనే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో పోటీకి దిగిన వీవీ గిరి, కాంగ్రెస్‌అభ్యర్థి నీలం సంజీవరెడ్డి మధ్య గట్టిపోటీతోపాటు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి చింతామణ్‌డి.దేశ్‌ముఖ్‌కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో(13 శాతం) ఓట్లు రాబట్టడంతో ఫలితం రెండో లెక్కింపులో తేలింది. మొదటి లెక్కింపులో గిరికి 48 శాతం, నీలంకు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్ప ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్రపతి అయిన రికార్డు గిరి పేరు చరిత్రలో నిలిచింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎప్పుడూ రాలేదు. అయితే, అంతకు ముందు జరిగిన 1967 ఎన్నికలో కూడా మొదటిసారి ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొంది.

కాంగ్రెస్‌అభ్యర్థి జాకిర్‌హుసేన్‌కేవలం 56.23 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తక్కువ ఓట్లు, మెజారిటీతో గెలిచినవారి జాబితాలో హుసేన్‌ది వీవీ గిరి తర్వాత రెండో స్థానం. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. దీనికితోడు లోక్‌సభలో 300 కన్నా తక్కువ సీట్లు సాధించడం, సోషలిస్ట్‌దిగ్గజం డా. రాంమనోహర్‌లోహియా ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడం వంటి కారణాలే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోకా సుబ్బారావుకు 43.43 ఓట్లు తెచ్చిపెట్టాయి.

65 శాతంతో గెలిచిన ఇద్దరు ప్రతిభ, కోవింద్‌!
వీవీ గిరి, జాకిర్‌హుసేన్‌తర్వాత తక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నవారిలో తర్వాత స్థానం ఇప్పటి బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌ది. ఆయనకు 65.65 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌అభర్థి మీరాకుమార్‌34.35 శాతం ఓట్లు సాధించారు. (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

సంబంధిత వార్త
ఈ లెక్కన వెంకయ్యకు 482 ఓట్లు

మరిన్ని వార్తలు