ఆనందమానంద ‘మాయనే’

7 Jun, 2017 14:44 IST|Sakshi
ఆనందమానంద ‘మాయనే’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఫడ్నవీస్‌ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల ఆనందోత్సవాలను కోరుకుంటోంది. అందుకని ఆ రాష్ట్రంలో ఓ అనంద విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సహాయక పునరావాస మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆ విభాగం రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు ఓ ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
 
ప్రపంచంలో ప్రభుత్వం హయాంలో ఓ ఆనంద విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే కొత్త కాదు. విలక్షణమైనదీ కాదు. భూటాన్‌ రాజు 1979లోనే ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌’ అని కూడా దానికి పేరు పెట్టారు. దేశాభివద్ధిని కొలవడానికి ఇది ప్రత్యామ్నాయ సూచిక అవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన దీనికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 2008లో ఈ విభాగాన్ని దేశ రాజ్యాంగంలో కూడా చేర్చారు. ఆ తర్వాత వెనిజులా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లాంటి దేశాలు ప్రజల ఆనందం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. 
 
ఈ దేశాలను స్ఫూర్తిగా తీసుకున్న భారత్‌లోని మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దేశంలో తొలిసారి హ్యాపీనెస్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. అది 2016, ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చింది. అదే బాటలో రాష్ట్ర ఆర్థికాభివద్ధిని అంచనావేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌ నెలలో ‘హ్యాపినెస్‌ ఇండెక్స్‌’ను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఆనంద విభాగం ఏర్పాటై దాదాపు ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంలో  ఈ విభాగం సాధించినది ఏమిటంటే గ్రామాల్లో పిల్లలు, పెద్దల మధ్య ఆటల పోటీలు నిర్వహించారట. పండగలు, పబ్బాలు జరిపారట. సభలు ఏర్పాటు చేసి ఆనందంగా జీవించడం ఎలాగో పాఠాలు చెప్పారట. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు 32 వేల మంది ‘ఆనందక్స్‌ (ఆనంద కార్యకర్తలు)’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారట. 
 
ఇక ఆనంద విభాగం వెబ్‌సైట్‌లో ప్రజలు ఆనందంగా ఉండాలంటే సానుకూల దక్పథాన్ని అలవర్చుకోవాలంటూ ఉపన్యాసాలు ఉన్నాయి. సగం గ్లాసులో నీళ్లు ఉంటే సగం గ్లాసు ఖాళీగా ఉందనుకోకుండా సగం గ్లాసు నీళ్లు ఉన్నాయనుకోవాలనే ఉదాహరణలు ఉన్నాయి. హ్యాపినెస్‌ క్యాలెండర్‌ ఒకటి ఉంది. ఆ క్యాలెండర్‌లో రోజువారిగా ప్రజలు తాము చేసిన మంచి పనులను, తప్తినిచ్చిన అంశాలను నమోదు చేసుకోవాలని, ఎవరెవరి నుంచి సహాయం తీసుకున్నామో కూడా నోట్‌ చేసుకొని వారికి కతజ్ఞతలు తెలియజేయాలని సూచనలు ఉన్నాయి. ఖరగ్‌పూర్‌ ఐఐటీ ద్వారా ఓ హ్యాపినెస్‌ ఇండెక్స్‌ను కూడా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అదెందుకో కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. అసలు ఆనందానికి నిజమైన భాష్యమేమిటో చెప్పలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితికి, ఆనందానికున్న అనుబంధాన్నీ వివరించలేదు. 
 
మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఆనంద విభాగం ప్రచార పటాటోపమే తప్ప దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర క్రీడలు, సంస్కతి, ఆరోగ్య, విద్యా శాఖల ఆధ్వర్యంలో గతంలో కూడా తమ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించేవారని, ఇప్పుడు ఆ కార్యక్రమాలనే ఆనంద క్రీడలు, ఆనంద సంస్కతి కార్యక్రమాలు, ఆనంద సభలు, ఆనంద ఆరోగ్య శిబిరాలు అని పిలుస్తున్నారని బర్వాణి జిల్లాకు చెందిన జర్నలిస్ట్‌ హేమంత్‌ గార్గ్, సామాజిక కార్యకర్త అజయ్‌ దూబె వ్యాఖ్యానించారు. మొదటి నుంచి అన్ని విధాల వెనకబడిన మధ్యప్రదేశ్‌ను అభివద్ధికి కషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రచార పటాటోపం కోసం ప్రజా సొమ్మును వధా చేస్తోందని వారు విమర్శించారు. 
 
ఐక్యరాజ్యసమితి అభివద్ధి విభాగం (యూఎన్‌డీపీ) లెక్కల ప్రకారం భారత్‌లో అత్యంత వెనకబడిన వంద జిల్లాల్లో దాదాపు 50 జిల్లాలు మధ్యప్రదేశ్‌కు చెందినవే. మానవ అభివద్ధి సూచికలో అట్టడుగు స్థానంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటని బెంగళూరుకు చెందిన ‘పబ్లిక్‌ అఫేర్స్‌ సెంటర్‌’ అని స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించింది. పౌష్టికాహారలోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్యకూడా ఎక్కువే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల నుంచి దళితుల వరకు, ఉద్యోగుల నుంచి చప్రాసీల వరకు వివిధ వర్గాల ప్రజలు ఎప్పుడు ఆందోళనలు చేస్తుంటారు. ఆందోళన చేస్తున్న రైతులపై మంగళవారం తూటాలు పేలడంతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఐదుగురు మరణించారు. ఇదంతా ఎవరి ఆనందం కోసం?
 
మరిన్ని వార్తలు