అత్యంత స్వచ్ఛ నగరం ఇండోర్‌

5 May, 2017 00:58 IST|Sakshi
అత్యంత స్వచ్ఛ నగరం ఇండోర్‌

తర్వాతి స్థానాల్లో భోపాల్, విశాఖపట్నం
► 434 నగరాల్లో పారిశుద్ధ్యంపై స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితా విడుదల
► అత్యంత చెత్త నగరంగా యూపీలోని గోండా..
► మొదటి 50లో 31 స్వచ్ఛ నగరాలు గుజరాత్, ఏపీ, మధ్యప్రదేశ్‌ల్లోనే..


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఘనత సాధించింది. ఇండోర్‌ తర్వాతి స్థానాల్లో భోపాల్‌(మధ్యప్రదేశ్‌), ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుజరాత్‌లోని సూరత్‌ నగరాలు నిలిచాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోని గోండా అత్యంత చెత్త నగరంగా జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌–2017 పేరిట దేశవ్యాప్తంగా మొత్తం 434 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిర్వహించిన ప్రజాభిప్రాయం మేరకు జాబితాను గురువారం కేంద్ర పట్టణా భివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విడుదల చేశారు. దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో 60 శాతం ప్రజలు నివసిస్తున్న 434 నగరాలు, పట్టణాల్లో (లక్షకు మించి జనాభా) ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సర్వే చేపట్టారు. దాదాపు 37 లక్షల మంది నుంచి ఆరు ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. అనంతరం నకిలీ వివరాలు తొలగించాక మొత్తం 18 లక్షల మంది అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు.

ఐదో స్థానానికి పడిపోయిన మైసూర్‌
గత రెండు సర్వేల్లోను మొదటి స్థానంలో నిలిచిన మైసూర్‌ నగరం ఈ సారి ఐదో స్థానానికి పడిపోయింది. ‘మైసూర్‌ నగరంలో పారిశుద్ధ్యం తగ్గడంమో, నగర పరిపాలన విభాగం ప్రయత్న లోపం వల్లో ర్యాంక్‌ తగ్గలేదు. ఇతర నగరాలు మైసూర్‌ కంటే మెరుగైన ఫలితాలు సాధించాయని’ వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి గతేడాది కంటే కొన్ని స్థానాలు ఎగబాకి 32 స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా జాబితా పరిశీలిస్తే.. మొదటి 50 స్థానాల్లో గుజరాత్‌లోని 12 నగరాలు, మధ్యప్రదేశ్‌ నుంచి 11, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 8 నగరాలు నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ఈ సర్వేలో పాలుపంచుకోలేదు.

50 చెత్త నగరాల్లో సగం యూపీలోనే..
ఇక జాబితాలో కింద నుంచి ఉన్న 50 చెత్త నగరాల్లో సగం ఉత్తరప్రదేశ్‌లోనే ఉండడం విశేషం. గోండా తర్వాత అత్యంత చెత్త నగరాలుగా భుసావల్‌ (మహారాష్ట్ర), బగహ, కతిహర్‌(బిహార్‌), హర్దోయి(ఉత్తరాఖండ్‌), బహ్రైచ్, షాజహాన్‌పూర్, ఖుర్జా (ఉత్తరప్రదేశ్‌), మక్తసర్, అబోహర్‌ (పంజాబ్‌)లు నిలిచాయి.

ప్రధాని మోదీ అభినందనలు
మొదటి 10 స్థానాల్లో నిలిచిన స్వచ్ఛ నగరాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పారిశుద్ధ్యం విషయంలో నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ దేశ సౌభాగ్యానికి సంకేతంగా పేర్కొంటూ ఆయన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

క్లీనెస్ట్‌ సిటీగా సూర్యాపేట
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్‌æS–2017 పేరుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో టాప్‌–50లో తెలంగాణ నుంచి 4 నగరాలు చోటు దక్కించుకున్నాయి. మున్సిపల్‌ డాక్యుమెంటేషన్, ప్రత్యక్ష పరిశీలన, పౌరుల స్పందన తదితర మూడు అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు.

జోనల్‌ వారీగా అవార్డులు: జోనల్‌ వారీగా ప్రతిభ కనబరిచిన నగరాలకు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా సౌత్‌జోన్‌లో తెలంగాణ నుంచి సూర్యాపేట అవార్డు సాధించింది. క్లీనెస్ట్‌ సిటీ విభాగంలో 2 లక్షల లోపు జనాభా కేటగిరీలో సూర్యాపేట ఈ అవార్డు సాధించింది. సూర్యాపేట తరపున మున్సిపల్‌ చైర్‌పర్సన్, అధికారులు అవార్డు అందుకున్నారు.

తెలంగాణ నుంచి ర్యాంకులు పొందిన పట్టణాలు..
తెలంగాణలో తొలిస్థానంలో ఉన్న హైదరాబాద్‌ జాతీయస్థాయిలో 22వ స్థానంలో నిలిచింది. అత్యల్ప పనితీరుతో మహబూబ్‌నగర్‌ చివరిస్థానంలో నిలిచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌–22, వరంగల్‌–28, సూర్యాపేట–30, సిద్దిపేట–45, నిజామాబాద్‌–178, మిర్యాలగూడ–182, రామగుండం–191, ఆదిలాబాద్‌–195, నలగొండ–200, కరీంనగర్‌–201, ఖమ్మం–236, మహబూబ్‌నగర్‌–249.

అత్యంత స్వచ్ఛ నగరాలు
ఇండోర్‌            (మధ్యప్రదేశ్‌)
భోపాల్‌            (మధ్యప్రదేశ్‌)
విశాఖపట్నం    (ఆంధ్రప్రదేశ్‌)
సూరత్‌            (గుజరాత్‌)
మైసూర్‌           (కర్ణాటక)
తిరుచురాపల్లి    (తమిళనాడు)
న్యూఢిల్లీ
నవీ ముంబై     (మహారాష్ట్ర)
తిరుపతి         (ఆంధ్రప్రదేశ్‌)
వడోదర          (గుజరాత్‌)


అత్యంత చెత్త నగరాలు
గోండా        (ఉత్తరప్రదేశ్‌)
భుసావల్‌   (మహారాష్ట్ర)
 బగహ       (బిహార్‌)
కతిహర్‌      (బిహార్‌)
హర్దోయ్‌     (ఉత్తరాఖండ్‌)
బహ్రైచ్‌       (ఉత్తరప్రదేశ్‌)
షాజహాన్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌)
ఖుర్జా        (ఉత్తరప్రదేశ్‌)
ముక్త్‌సర్‌     (పంజాబ్‌)
అబోహర్‌     (పంజాబ్‌)

మరిన్ని వార్తలు