‘అణు విద్యుత్‌’కు ముందుకొస్తేనే.. | Sakshi
Sakshi News home page

‘అణు విద్యుత్‌’కు ముందుకొస్తేనే..

Published Fri, May 5 2017 12:58 AM

‘అణు విద్యుత్‌’కు ముందుకొస్తేనే..

రాష్ట్రాలకు కరెంటు సాయం చేస్తాం: గోయల్‌
►  ఆధార్‌ ద్వారా బిల్లుల చెల్లింపును ప్రోత్సహించాలి 

న్యూఢిల్లీ: అణువిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే రాష్ట్రాలకు గరిష్టంగా విద్యుత్‌ పంపిణీ జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఆధార్‌ అనుసంధానిత బ్యాంకు అకౌంట్ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్‌ శాఖ మంత్రులతో రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో మంత్రి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.

‘ఏ రాష్ట్రమైనా అణువిద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపకుండా.. పక్క రాష్ట్రాల ఉత్పత్తి ఫలాలను అనుభవించాలనుకుంటే అలాంటి ఆలోచనలను అనుమతించం. అలాంటి వారు ఎక్కువకాలం కేంద్రం విద్యుత్‌ సాయాన్ని ఆశించకూడదు’ అని గోయల్‌ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని కొత్త పంపిణీ విధానంలో చేరుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాడ్గిల్‌ ఫార్ములా ప్రకారం విద్యుత్‌ పంపిణీ జరుగుతోందని, ఈ పంపిణీ విధానాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తిపై ఒకే స్థిరమైన ధరను నిర్ణయించాలన్న ఎన్టీపీసీ సూచనను ఈ సందర్భంగా గోయల్‌ గుర్తుచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement