ఆన్‌లైన్‌ క్లాసులు: ఆల్టర్నేటివ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌!

3 Jun, 2020 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో విద్యా సంస్థలు తెరిచే అంశంలో సందిగ్ధత నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయం సమీపించినప్పటికీ మహమ్మారి భయాల దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు పాఠశాలలు ఇప్పుడే తెరవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ బోధనకు అనుమతినిస్తూ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల కోసం ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్‌ అకడమిక్‌ క్యాలెండర్ ‌(హయ్యర్‌ సెకండరీ స్టేజ్‌)ను విడుదల చేసింది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంట్లోనే అత్యుత్తమ విద్యా బోధనకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.(పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!)

ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ సందేశాన్ని విడుదల చేశారు.‘‘కోవిడ్‌-19 విజృంభణతో భారత్‌ సహా వివిధ ప్రపంచ దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విద్యార్థులు, టీచర్లు ఇంటికే పరిమితమయ్యారు. ఇ- పాఠశాల, ఎన్‌ఆర్‌ఓఈఆర్‌, స్వయం, దీక్షా తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇ- వనరులు, ఇ- పుస్తకాలతో ఆన్‌లైన్‌లో విద్యా బోధన జరుగుతోంది. ఉన్నత పాఠశాల విద్యార్థులు తమంతట తాముగా కొంతవరకు చదువుకోగలరు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి.(కోవిడ్‌ మరణాల రేటు 2.82%)

ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంటూనే క్రమపద్ధతి ప్రకారం విద్యా బోధన జరిగేందుకు ఎన్‌సీఈఆర్‌టీ అభివృద్ధి చేసిన ఆల్టర్నేటివ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేశాం. ఫోన్‌, రేడియో, ఎస్‌ఎంఎస్‌, టీవీ సహా ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా టీచర్లు విద్యార్థులను గైడ్‌ చేయవచ్చు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యార్థులకు ఈ వెసలుబాటు కల్పిస్తాయని ఆశిస్తున్నా. అంతేకాదు మన ఉపాధ్యాయులు విద్యార్థులు ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా వారికి ప్రశాంత వాతావరణంలో నాణ్యమైన విద్య అందించి.. వారిలో స్ఫూర్తి నింపుతారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాగా క్యాలెండర్‌ విషయంలో ఏవైనా సందేహాలు ఉన్నా.. ఇంకేమైనా సూచనలు చేయాలన్నా director.ncert.@nic.in లేదా cg ncert 2019@gmail.com ను సంప్రదించవచ్చని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు