అభినందన్‌కు ట్రాన్స్‌ఫర్‌!

20 Apr, 2019 20:35 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే గతంలో ఆయన పనిచేసిన శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌లో కాకుండా మరో చోట పోస్టింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు... ‘  ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌కు పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేశాం. పాక్‌ సరిహద్దులోని ఓ ఎయిర్‌బేస్‌లో తను విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే అది శ్రీనగర్‌లోనా.. మరే ఇతర చోటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అతడు తన విధుల్లో చేరతాడు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో.. పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్‌ విమానం కూలిపోగా...ఆయన పాక్‌ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్‌ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్‌ సెషన్‌(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.

మరిన్ని వార్తలు