'రాజ్‌నాథ్‌ కొడుకులా కాదు.. కార్యకర్తగా వస్తున్నా'

23 Jan, 2017 19:00 IST|Sakshi
'రాజ్‌నాథ్‌ కొడుకులా కాదు.. కార్యకర్తగా వస్తున్నా'

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తానేం తక్కువ కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడు పంకజ్‌ సింగ్‌ అన్నారు. ఇప్పుడప్పుడే వారిపై తాను ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. త్వరలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నోయిడా నుంచి ఎమ్మెల్యేగా పంకజ్‌ బీజేపీ తరుపున బరిలోకి దిగాడు. వాస్తవానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లల పోటీ చేయొద్దని ప్రధాని మోదీ నిబంధన పెట్టినప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల పలువురు నేతలు తమ పిల్లలను, మనుమళ్లనుమనువరాళ్లను బరిలోకిదించారు.

అయితే, తన ఆరంగేట్రాన్ని పంకజ్‌ సమర్థించుకున్నారు. మోదీ పెట్టిన నిబంధనను తాను మీరలేదన్నారు. తాను తన తండ్రి రాజ్‌నాథ్‌ సింగ్ అసలు రాజకీయాలు మాట్లాడుకోమని, ఎప్పుడూ ఆయన ఆశీస్సులు మాత్రమే తీసుకుంటానని అన్నారు. తాను కేంద్ర హోంమంత్రి కొడుకులా కాకుండా ఓ కార్యకర్తలా వస్తున్నానని అన్నారు.

చాలా ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న పంకజ్‌ 2014లోనే సీటు కోరుకున్నప్పటికీ అప్పటి నేతలు ఎంపికచేయలేదని, ఇప్పుడు ఆయన తండ్రి స్థాయిని చూసి కాకుండా రాజకీయ సేవను చూసి సీటు ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నోయిడాలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఓం మార్థుర్‌ని పక్కకు పెట్టి మరీ పంకజ్‌కు సీటు ఇచ్చారంట. దీనిపై స్థానిక పార్టీ క్యాడర్‌ మొత్తం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తుండగా తాము ఇప్పటికే అందరితోనూ చర్చలు జరిపి వారు అంగీకరించాకే తనకు ఆ సీటు కేటాయించారని పంకజ్‌ తెలిపారు. తనను 200శాతం తగినవాడిని అని భావించారని, స్థానికుల మద్దతు తనకే ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు