కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్‌!

15 Nov, 2023 22:23 IST|Sakshi

దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్‌ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్‌ ఫార్మసీ కమిషన్‌ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం.  దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని  భర్తీ చేసే నేషనల్‌ ఫార్మసీ కమిషన్‌ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది.

నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ  పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది.

 ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.

నేషనల్‌ ఫార్మసీ కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు 13 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్‌ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్‌ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌, ఫార్మసీ ఎథిక్స్‌ అండ్‌ రిజిష్ట్రేషన్‌ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

మరిన్ని వార్తలు