జపాన్‌తో పౌర అణు ఒప్పందం!

11 Aug, 2014 01:07 IST|Sakshi
జపాన్‌తో పౌర అణు ఒప్పందం!

జపాన్ విదేశాంగ మంత్రితో సుష్మ భేటీ    
 
నేపితా(మయన్మార్): త్వరలో భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. జపాన్‌తో పౌర అణు ఒప్పందం విషయంలో చర్చలను సాధ్యమైనంత త్వరలో సానుకూలంగా ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. తూర్పు ఆసియా దేశాల విదేశాంగమంత్రుల  భేటీ సందర్భంగా మయన్మార్ రాజధాని నేపితాలో ఆదివారం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్  జపాన్ విదేశాంగమంత్రి కిషిదాతో సమావేశమయ్యారు. పౌర అణు ఒప్పందం విషయంలో అపరిష్కృత అంశాలను చర్చించేందుకు ప్రత్యేక బృందాన్ని భారత్‌కు పంపిస్తామని కిషిదా హామీ ఇచ్చారు.

కాగా, ఆసియా పసిఫిక్ దేశాలకు ఉగ్రవాద పీడ సవాలుగా మారిందని, దాన్ని కలసికట్టుగా ఎదుర్కోవాల్సి ఉందని సుష్మా స్వరాజ్ ఆసియాన్ దేశాలకు పిలుపునిచ్చారు. మయన్మార్ రాజధానిలో ఆసియాన్ రీజనల్ ఫోరమ్(ఏఆర్‌ఎఫ్) సమావేశంలో ఆదివారం ఆమె ప్రసంగించారు. ‘ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా సమష్టిగా నిర్దిష్టమైన కార్యాచరణతో.. అలుపులేని పోరాటం సాగించాలి. ఏఆర్‌ఎఫ్ సభ్య దేశాల్లో వారికి ఆశ్రయం కానీ ప్రోత్సాహం కానీ లభించకూడదు’ అన్నారు.
 

మరిన్ని వార్తలు