ఆకలి భారతం

17 Oct, 2019 02:52 IST|Sakshi

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో అట్టడుగుకి పడిపోతోన్న భారత్‌

ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లల శాతం.. ప్రమాదకర స్థాయిలో

న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి తీవ్రత పెరిగింది. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం అట్టడుగు స్థానానికి చేరువలో ఉన్న ట్టు అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. 2019 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 117 ప్రపంచ దేశాల్లో మన దేశం 102వ స్థానానికి దిగజారిందని వెల్లడించింది. మనకన్నా పేదరికంలో ఉన్న, అత్యంత వెనుకబడి ఉన్న దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకన్నా మనదేశం వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరిష్‌ సహాయ సంస్థ కన్సర్న్‌ వరల్డ్‌వైడ్, జర్మన్‌ సంస్థ వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంయుక్తంగా తయారుచేసిన ఈ నివేదిక భారత్‌లో ఆకలి తీవ్రమైందని హెచ్చరించింది.

దేశంలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరని, ఇతర దేశాలకంటే అతి తక్కువ బరువుతో ఉన్నారంది. 2008–12 మధ్య బరువు తక్కువ ఉన్న పిల్లల శాతం దేశంలో 16.5 శాతం ఉండగా, 2014–18కి మధ్య 20.8 శాతానికి దిగజారింది. 2030 కల్లా ఆకలిని జయించేవైపు దేశం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలో మొత్తం 113 దేశాల్లో భారత్‌ 83 స్థానంలో ఉండగా, 2018లో మొత్తం 119 దేశాల జాబితాలో 103 స్థానంలో ఉంది.

నాలుగు అంశాల ఆధారంగా రేటింగ్‌...
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ కేటగిరీలో మన దేశం 30.3 స్కోరుతో ఉంది. ఈ స్కోరుని నాలుగు సూచీలపై ఆధారపడి నిర్ణయిస్తారు. పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉండడం, వయసుకి తగ్గ ఎత్తు ఎదగకపోవడం, శిశు మరణాలు.

నివేదిక ముఖ్యాంశాలు
► దేశంలో కేవలం 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న వారిలో 9.6 శాతం మందికి మాత్రమే ‘కనీస ఆహార అవసరాలు’తీరుతున్నాయి.

► భారత్‌లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందనీ, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయంది.  

► బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌ సహా మొత్తం 17 దేశాలు ఈ సూచీలో 5 కన్నా తక్కువ ర్యాంకుతో ఉన్నత స్థానంలో ఉన్నాయి.

► నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే, తీవ్రమైన వాతావరణ మార్పులతో సతమతమౌతోన్న యెమన్, జిబౌటి దేశాలు సైతం భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నాయి.  

► పొరుగు దేశాలైన నేపాల్‌(73), శ్రీలంక(66), బంగ్లాదేశ్‌(88), మయన్మార్‌(69), పాకిస్తాన్‌ (94) స్థానంలో ఉండి ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి.  

► చివరకు చైనా (25) సైతం భారత్‌ కన్నా మెరుగైన స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు