చైనా కంపెనీ రైల్వే కాంట్రాక్టు రద్దు

19 Jun, 2020 06:24 IST|Sakshi
కోల్‌కతాలో చైనా ఉత్పత్తులను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

న్యూఢిల్లీ: భారత–చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ ప్రాంతంలో 20 మంది భారత సైనికుల వీర మరణం నేపథ్యంలో రైల్వే శాఖ తీవ్ర నిర్ణయం తీసుకుంది. చైనా కంపెనీకి అప్పగించిన రూ.471 కోట్ల ప్రాజెక్టును రద్దు చేసింది. కాన్పూర్‌ నుంచి మొగల్‌సరాయి వరకు ఈస్టర్న్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లోని 417 కి.మీ.ల మార్గంలో సిగ్నలింగ్, సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం చైనాకు చెందిన బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసెర్చ్, డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సిగ్నల్,కమ్యూనికేషన్‌ గ్రూప్‌తో 2016లో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టును 2019కల్లా పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా 20 శాతం పనులే పూర్తయ్యాయి.

ఇంజినీర్ల పర్యవేక్షణ లేకుండానే పనులు జరుగుతున్నాయని, ఒప్పందం ప్రకారం లాజిక్‌ డిజైన్‌ వంటి సాంకేతిక పత్రాలను చైనా సంస్థ ఇప్పటి వరకు తమకు అందించలేదని రైల్వే శాఖ అధికారులు అన్నారు. కాంట్రాక్టును వేగవంతం చేయాలంటూ పలు దఫాలుగా ఆ సంస్థ అధికారులతో చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించ లేదన్నారు. సకాలంలో పనులను పూర్తి చేయలేక పోవడంతోపాటు పనుల్లో పురోగతి చాలా స్వల్పంగా ఉండటం వల్లే చైనా సంస్థతో కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రపంచ బ్యాంకుకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు. అయితే, సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న చర్యలకు ప్రతీకారంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు