150 ఏళ్లకు ఎగసిన లావా

19 Feb, 2017 02:26 IST|Sakshi
150 ఏళ్లకు ఎగసిన లావా

పణజీ: దాదాపు 150 సంవత్సరాలుగా నిద్రాణ స్థితిలో ఉన్న ‘బ్యారెన్  ఐలాండ్‌’అగ్నిపర్వతం తాజాగా తిరిగి లావాను వెదజల్లుతోందని పరిశోధకులు శుక్రవారం చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న అగ్ని పర్వతం ఇదొక్కటే. అండమాన్  నికోబార్‌ దీవుల్లో, రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో ఉంటుంది. 1991 నుంచే అప్పుడప్పుడు ఈ అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వచ్చేవి. గోవాలోని జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్ ఐఓ)లో పనిచేసే పరిశోధకుల బృందం ఈ ఏడాది జనవరి 23న అండమాన్  తీరంలోని సముద్ర మట్టిని సేకరించేందుకు అగ్ని పర్వతం వద్దకు వెళ్లింది.

ఆ సమయంలో బూడిద వెలువడుతుండటం చూసి పరిశోధకులు పర్వతానికి దూరంగా వచ్చి గమనించారు. అగ్నిపర్వతం విడతల వారీగా లావాను వెదజల్లుతోందనీ, ప్రతిసారీ 5 నుంచి 10 నిమిషాల పాటు లావాను బయటకు చిమ్ముతోందని పరిశోధకులు గుర్తించారు. జనవరి 26న ఇదే సంస్థకు చెందిన మరో బృందం అక్కడకు వెళ్లినప్పుడు కూడా బూడిద వెలువడింది. పగటి సమయంలో కేవలం బూడిద మాత్రమే కనపడగా, చీకటి పడ్డాక చూస్తే ఎర్రటి లావా కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. అగ్ని పర్వత బిలం వద్ద పొగ మేఘాలు కమ్ముకున్నాయి.

>
మరిన్ని వార్తలు