ప్రళయ నామకరణమస్తు..!

4 May, 2019 04:54 IST|Sakshi
ఫొని (పాము పడగ) శాటిలైట్‌ చిత్రం

తుపాన్లకు పేర్లు పెట్టడంలో వినూత్న పద్ధతి

8 దేశాలు.. ఒక్కో దేశం.. ఒక్కో పేరు

పేరు పెట్టడంలోనూ అనేక జాగ్రత్తలు

ఒక్కసారి వాడిన పేరు మళ్లీ పెట్టరు

‘ఫొని’ పేరు పెట్టిన బంగ్లాదేశ్‌..  

న్యూఢిల్లీ: మాలా, హెలెన్, నర్గీస్, నీలోఫర్‌.. ఏంటీ, ఎవరో హీరోయిన్ల పేర్లు విన్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక్క క్షణం ఆగండి.. ఈ పేర్లన్నీ విధ్వంసకర గాలులకు, భారీ వానలకు, పెను వినాశనానికి సూచికలు. ప్రళయం సృష్టించే తుపాన్లకు పెట్టిన పేర్లే ఇవన్నీ.. 

ఒడిశాను అతలాకుతలం చేస్తున్న తుపానుకు ‘ఫొని’ పేరు రావడం వెనుక, రాబోయే తుపాన్లకు సైతం ముందే పేర్లు నిర్ణయింపబడటం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ప్రస్తుతం కలవరం పుట్టిస్తున్న ‘ఫొని’ తుపానుకు ఆ పేరు పెట్టింది బంగ్లాదేశ్‌. ‘ఫొని’ అంటే ‘పాము పడగ’ అని అర్థం. 

సైక్లోన్లకు పేరు పెట్టే విధానం ఇలా మొదలైంది? 
ఆసియా, ‘పసిఫిక్‌’ దేశాలకు సంబంధించిన ప్రపంచ మెటియిరోలాజికల్‌ ఆర్గనైజేషన్‌/ ఎకనమిక్, సోషల్‌ కమిషన్‌ 2000వ సంవత్సరంలో మస్కట్, ఒమన్‌లో తుపాన్లకు సంబంధించి 27వ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రాల్లో సంభవించే తుపాన్లకు కొత్తగా పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తర్వాత అనేక చర్చల తర్వాత 2004 సెప్టెంబర్‌లో బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం తీర ప్రాంత 8 దేశాలు అక్షర క్రమంలో తుపాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి. అక్షర క్రమంలో బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు వరుసగా పేర్లు సూచించాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. 

తుపాన్లకు ఆ పేరు ఇలా పెడతారు? 
ఢిల్లీలోని రీజినల్‌ స్పెషలైజ్డ్‌ మెటియిరోలాజికల్‌ సెంటర్‌ (ఆర్‌ఎస్‌ఎంసీ) అరేబియన్‌ మహా సముద్రం, బంగాళాఖాతంలో భవిష్యత్తులో ఏర్పడబోయే తుపాన్లను గుర్తిస్తాయి. వీటి పేర్లను 8 సభ్య దేశాలు అక్షర క్రమంలో నిర్ణయిస్తాయి. ఇలా మొదటి సారిగా బంగ్లాదేశ్‌ ‘ఒనిల్‌’ పేరు సూచించగా.. 2004 సెప్టెంబర్‌– అక్టోబర్‌ మధ్య మన దేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో సంభవించిన భారీ తుపానుకు ఈ పేరు పెట్టారు. ‘ఒనిల్‌’ ప్రభావం అప్పట్లో భారత్‌తో పాటు పాకిస్తాన్‌పై కూడా పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన ‘పెథాయ్‌’ తుపానుకు ఆ పేరు థాయ్‌లాండ్‌ పెట్టింది. అలాగే ఇప్పటి ‘ఫొని’ తర్వాత సంభవించబోయే తుపానుకు ఇండియా ‘వాయు’ అనే పేరు పెట్టింది. అలాగే మాలా, హెలెన్, నీలోఫర్‌ పేర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ దేశాలు పెట్టాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తం 64 పేర్లను 8 దేశాలు సూచిస్తే 57 పేర్లను ఉపయోగించేశారు. 

పేరు పెట్టడంలో అనేక జాగ్రత్తలు.. 
ఈ తుపాను పేర్లకు సంబంధించి సభ్య దేశాలు, ఆర్‌ఎస్‌ఎంసీ కొన్ని నిబంధనలు రూపొందించాయి. తుపాన్ల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుండటం వల్ల వీటి పేరు మళ్లీ వింటే ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నందున ఒక్కసారి ఉపయోగించిన పేరును తిరిగి వాడకూడదు. అలాగే తుపాన్లకు సాధారణ ప్రజలు కూడా నిబంధనలకు లోబడి పేరును సూచించవచ్చు. ఆయా పేర్లు చిన్నవిగా, మీడియాలో ప్రసారం చేసేటప్పుడు అర్థమయ్యేలా ఉండే వాటిని ఎంపిక చేస్తారు. అలాగే సాంస్కృతికంగా సున్నితమైన పేర్లను పెట్టకూడదు. అలాగే అంతర్లీనంగా ఇతరులను నొప్పించే అర్థం వచ్చే పేర్లు పెట్టకూడదు. అసలు ఈ తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది.   

మరిన్ని వార్తలు