విక్రమ్‌ ధ్వంసం కాలేదు

10 Sep, 2019 03:52 IST|Sakshi

చంద్రుడిని ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది

సంబంధాల పునరుద్ధరణకు ఓ బృందం పనిచేస్తోంది: ఇస్రో

బెంగళూరు/కరాచీ: చంద్రయాన్‌–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్‌ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్‌ ముక్కలు కాలేదు.

ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్‌ ఉన్నట్లు  గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్‌–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్‌ ఉండగా, కమాండ్‌ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఇస్రోకు పాక్‌ వ్యోమగామి మద్దతు..
విక్రమ్‌ వైఫల్యంపై పాక్‌ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ చౌదరి ఎగతాళి చేసిన వేళ పాకిస్తాన్‌ నుంచే ఇస్రోకు మద్దతు లభించింది. చంద్రయాన్‌–2 ప్రయోగం గొప్ప ముందడుగని పాక్‌ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం ప్రశంసించారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు చంద్రయాన్‌–2తో చారిత్రాత్మక ప్రయోగం చేపట్టిన ఇస్రోను అభినందిస్తున్నా. ఈ ప్రయోగంతో దక్షిణాసియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమ కూడా గర్వపడేలా ఇస్రో చేసింది’ అని కితాబిచ్చారు. పారిశ్రామికవేత్త రిచర్డ్‌ బ్రాన్సన్‌కు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ అనే సంస్థ ప్రయోగించిన వాహకనౌక ద్వారా అంతరిక్షంలో విహరించిన నమీరా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా