జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 11 ప్రయోగం విజయవంతం

19 Dec, 2018 16:26 IST|Sakshi

సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): వరుస ప్రయోగాలు, విజయాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్‌-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. దీంతో ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు విమానయాన వ్యవస్థకు సేవలు అందించనుంది. భారత కాలమాన ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌11) ప్రయోగించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీఎస్‌ఎల్‌వీ వెహికల్‌ నింగిలోకి దూసుకెళ్లింది.   2,250 కిలోలు బరువు కలిగిన జీశాట్‌–7ఎ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌  నింగి వైపునకు దూసుకెళ్లింది. 

అడ్వాన్స్‌డ్‌ మిలటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌–7ఏ: కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో జీశాట్‌–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు ఎక్కువగా డీటీహెచ్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. జీశాట్‌–7ఏ మాత్రం అడ్వాన్స్‌డ్‌ మిలటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా ఇస్రో చెబుతోంది. 2,250 కిలోలు బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్‌ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌)లో రూపొందించారు.

సిబ్బంది, శాస్త్రవేత్తల అంకితభావంతోనే విజయాలు
సిబ్బంది సమష్టి కృషి వల్లే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 ప్రయోగతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ కె శివన్‌ పేర్కొన్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం ప్రయోగించిన  జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌11) విజయవంతం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోయినా సిబ్బంది, శాస్త్రవేత్తలు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. శ్రీహరికోట నుంచి 35 రోజుల్లో మూడు ప్రయోగాల విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిని ఇస్రో విజవంతంగా ముగించిందని, వచ్చే ఏడాది మరిన్ని ప్రయోగాలు చేస్తామని శివన్‌ తెలిపారు. 

వైఎస్‌ జగన్‌ అభినందనలు
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌11 ప్రయోగం విజయవంతమవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేపట్టి దేశాభివృద్దికి కృషి చేయాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు