వైభవంగా శ్రీకృష్ణాష్టమి

19 Aug, 2014 22:41 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్ : నగరంలోని వివిధ కూడళ్లు, మందిరాల్లో వేలాది మంది భక్తులు శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పింపలే గురవ్‌లోని శ్రీకృష్ణ దేవాలయంలో తెల్లవారుజామున ప్రారంభమైన అభిషేకాలు, జపాలు, నామ పారాయణాలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం ఆదివారం రాత్రి 12 గంటల నుంచి మహిళలు శ్రీ కృష్ణుని ప్రతిమలను గొల్ల భామల మధ్య ఉంచి ఉయ్యాలలు ఊపుతూ పాటలను పాడారు. ఉదయం నుంచి తీర్థ ప్రసాదాలాను పంచి పెట్టారు.

ఈ ప్రాంతంలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండడంతో తెలుగు దనం ఉట్టి పడింది. రావేత్‌లోని ఇస్కాన్ వారి శ్రీరాధాగోవింద మందిరంలో శ్రీకృష్ణుని జనన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సుమారు 40-50 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు దేవాలయ వ్యవస్థాపకులు తెలిపారు.

 నిగిడిలో రోజంతా భజనలు
 నిగిడిలోని తమిళ సమాజం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మందిరంలో జన్మాష్టమిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలి వచ్చారు. రోజంతా ధూప, దీప హారతులతోపాటు భజనలు, కీర్తనలతో దేవాలయం మార్మోగింది.  విశ్వం శ్రీరాం సేన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తరుణ్ మండల్ తరఫున చికిలీలో జన్మాష్టమి వేడుకలు జరుపుకొన్నారు. భోజ్‌పూరిలో  గాయకుడు ప్రమోద్‌లాల్ యాదవ్, గాయని బిందు రాగిణి పాడిన పాటలు భక్తులను పరవశింపజేశాయి.

 ఈ కార్యక్రమంలో శివసేనకు చెందిన సులభా ఉభాలే, నగర కార్పొరేటర్ సురేష్ మాత్రే, దత్తా సానే, పర్యావరణ శాస్త్రవేత్త వికాస్ పాటిల్, విశ్వ శ్రీరాం సేన సంచాలకులు లాలాబాబు గుప్తా, పోలీస్ అధికారి విఠల్ సాలుంకే, పూణే జిల్లా పరిషత్ మాజీ సమన్వయకులు రంగనాథ జాదవ్ తదితరులు హాజరయ్యారు. నగరంలోని పలు కూడళ్లలో సాయంత్రం  దహీహండి (ఉట్టీల) కార్యక్రమాలు, ఆటపాటలతో  యువత ఊగిపోయింది. ఉట్టీల పోటీ ల్లో సినీ, నాటక కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు