తమిళనాట ఐటీ అటాక్‌!

10 Nov, 2017 01:47 IST|Sakshi

శశికళ, దినకరన్‌ సన్నిహితుల ఆస్తులపై మెరుపు సోదాలు

తమిళనాడు, బెంగళూరు, పుదుచ్చేరిలో ఏకకాలంలో 187 చోట్ల..

‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’లో భాగమన్న ఐటీ అధికారులు

జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికల కార్యాలయాల్లోనూ తనిఖీలు

జయ ఆరోగ్యానికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం?

సాక్షి, చెన్నై: దినకరన్‌తోపాటు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ, ఆమె సన్నిహితుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేసి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు వ్యాప్తంగా గురువారం ఏకకాలంలో 187 చోట్ల ఈ దాడులు జరగటం చర్చనీయాంశమైంది. పుదుచ్చేరి, బెంగళూరుల్లోని వీరి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అన్నాడీఎంకే (శశికళ వర్గం) ఆధ్వర్యంలో నడుస్తున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. జయలలిత మరణానంతరం శశికళ వర్గం ఆధ్వర్యంలో జయ టీవీ నడుస్తోంది. ఈ దాడుల్లో భారీగానే రికార్డులు బయటపడ్డట్టు సమాచారం. మన్నార్‌గుడిలో శశికళ సోదరుడు దివాకరన్‌ ఇంట్లో తనిఖీల అనంతరం అతన్ని అధికారులు విచారణకు తీసుకెళ్లినట్టు సమాచారం.

ఉదయం ఆరుగంటల నుంచే..
జయలలిత నెచ్చెలి శశికళపై ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన కేసులో బుధవారం తుది విచారణ పూర్తయింది. తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలో శశికళ, దినకరన్‌ కుటుంబాలే లక్ష్యంగా ఏకకాలంలో తమిళనాడు, పుదుచ్చేరి, బెంగళూరుల్లో ఐటీ దాడులు జరగడం తమిళనాట సంచలనం రేపింది. శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారులు దినకరన్, భాస్కరన్, అన్న సుందరవనన్‌ కుమారుడు డాక్టర్‌ వెంకటేషన్, శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇలవరసి కుమారుడు వివేక్‌ జయరామన్, కుమార్తె కృష్ణప్రియ, బంధువు కళియ పెరుమాల్, దివాకరన్‌ అల్లుడు డాక్టర్‌ విక్రమ్, స్నేహితులు అగ్రి రాజేంద్రన్, మన్నార్‌గుడి సుజయ్, సహాయకుడు వినాయకం, న్యాయవాది సెంథిల్, ఆడిటర్‌ చంద్రశేఖరన్, పారిశ్రామికవేత్త ఆర్ముగస్వామిలతో పాటు శశికళ, దినకరన్‌ మద్దతు అన్నాడీఎంకే నాయకులు, వారి బంధువులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచి 1,800 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. వేర్వేరు బృందాలుగా తంజావూరు, తిరువారూర్, మన్నార్‌గుడి, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చి, ఈరోడ్, పుదుకోట్టై తదితర ప్రాంతాల్లో పోలీసు పహారాతో తనిఖీలు నిర్వహించారు. చెన్నైలోనే 20 చోట్ల తనిఖీలు చేశారు. గురువారం రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులోని మురుగేష్‌పాళ్యలో ఉంటున్న శశికళ ఆప్తుడు, అన్నాడీఎంకే కర్ణాటక ఇన్‌చార్జ్‌ పుహళేంది ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

బెదిరింపులకు భయపడం: దినకరన్‌
తమను అణగదొక్కే లక్ష్యంతో కేంద్రం రచించిన వ్యూహాన్ని ఐటీ వర్గాలు అమలు చేస్తున్నాయని దినకరన్‌ మండిపడ్డారు. చిన్నమ్మను, తనను రాజకీయాల్లో లేకుండా చేయడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందన్నారు.  

జయ అనారోగ్యం గుట్టు చిక్కినట్లేనా?
జయలలితకు ఇష్టమైన జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల కారణంగా టీవీ ప్రత్యక్ష  ప్రసారాలకు ఆటంకం కలగటంతో మీడియా వర్గాలనుంచి ఆగ్రహం వ్యక్తమైంది. జయ టీవీ కార్యాలయం తనిఖీల్లో జయ వైద్య చికిత్సల రికార్డులు దొరికినట్లు సమాచారం. దీంతోపాటు జయ టీవీకి అనుబంధంగా ఉన్న మిడాస్‌ డిస్టిలరీస్, జాజ్‌ సినిమా, పలు నగల దుకాణాలు, ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు సాగాయి. జయకు అత్యంత ఇష్టమైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోనూ ఐటీ దాడులు సాగాయి. కొన్నిచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా ‘శ్రీని వెడ్స్‌ మహి’ అన్న పెళ్లి వేడుక బోర్డు ఉన్న వాహనాల్లో అధికా రులు సోదాలు జరిగే ప్రాంతాలకు వచ్చా రు. అక్రమ పెట్టబడులు, నోట్లరద్దు అనం తరం భారీగా నగదు డిపాజిట్లు, బినామీ ఆస్తులపై ఆర్థిక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగానే దాడు లు జరిగినట్లుగా అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు