పోలవరంపై రాష్ట్ర వ్యవహారం అంతా గోల్‌మాల్‌ | Sakshi
Sakshi News home page

పోలవరంపై రాష్ట్ర వ్యవహారం అంతా గోల్‌మాల్‌

Published Fri, Nov 10 2017 1:43 AM

state affair on polavaram is golmal - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2018 జూన్‌ నాటికి పాక్షికంగా పూర్తిచేసి, గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనల్లోని డొల్ల తనాన్ని మసూద్‌ హుస్సేన్‌ కమిటీ బట్టబయలు చేసింది. ప్రాజెక్టు ఫలాలను ఏడాది ముందుగా అందుకోవడానికి కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 31 మీటర్ల నుంచి 42 మీటర్లకు పెంచుతామని చేసిన ప్రతిపాదన అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధేలేదని తేల్చి చెప్పింది. భూసేకరణ చేయకుండా, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 42 మీటర్ల ఎత్తుతో కాఫర్‌ డ్యామ్‌ను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. స్పిల్‌వేతోపాటు కుడి, ఎడమ కాలువలను వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వల్లెవేస్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరుకు పొంతనే లేదని స్పష్టం చేసింది. కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికీ చేపట్టలేదని, కనీసం భూసేకరణ కూడా చేయలేదని, 2018 నాటికి ప్రాజెక్టు ఫలాలను ఎవరికి అందిస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించింది.

భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయాన్ని రూ.2,934.41 కోట్ల నుంచి రూ.32,392.24 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ప్రాజెక్టు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని మసూద్‌ హుస్సేన్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యంలో పనుల పర్యవేక్షణకు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) డీజీ మసూద్‌ హుస్సేన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పనులను పరిశీలించి, కేంద్రానికి నివేదిక ఇవ్వడం ఈ కమిటీ విధి. గత ఏప్రిల్‌ 19 నుంచి 22వ తేదీ వరకూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించి, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై సేకరించిన ఆధారాలు, అధ్యయనంలో వెల్లడైన అంశాలతో మసూద్‌ హుస్సేన్‌ కమిటీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని తేల్చింది.

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కాఫర్‌ డ్యామ్‌ను 42 మీటర్ల ఎత్తుతో నిర్మించాలంటే స్పిల్‌ వే పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని, కానీ, స్పిల్‌ వే పనుల్లో ప్రస్తుతం నెలకు సగటున 20 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మాత్రమే చేస్తున్నారని కమిటీ వెల్లడించింది. 2018 జూన్‌ నాటికి స్పిల్‌ వే పూర్తి కావాలంటే నెలకు సగటున 4.57 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాలు, సిబ్బందిని పరిగణనలోకి తీసుకుంటే ఆలోగా పనులు కావని పేర్కొంది. ఇక కుడి, ఎడమ కాలువల విషయంలో చాలా నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. కుడి, ఎడమ కాలువ కింద ఆయకట్టుకు నీళ్లందించేందుకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను ఇప్పటిదాకా ప్రారంభించలేదని వెల్లడించింది. డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం ఇంకా సర్వే చేస్తున్నామని రాష్ట్ర అధికారులు చెప్పారని నివేదికలో పేర్కొంది. వీటిని పరిశీలిస్తే ప్రాజెక్టు ఫలాలను ఏడాది ముందుగా అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలో చిత్తశుద్ధి లేదని స్పష్టం చేసింది.

లాభదాయకతపై అనుమానాలు
పోలవరం ప్రాజెక్టు కోసం 1,60,589 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రాకముందే 70,482.56 ఎకరాలు సేకరించారు. చట్టం అమల్లోకి వచ్చాక 6,012.70 ఎకరాలు సేకరించారు. ఇంకా 84,093.74 ఎకరాలు సేకరించాలి. భూసేకరణకు ఇప్పటిదాకా రూ.2,168.47 కోట్లు ఖర్చు చేశారు. మిగతా 84,093.74 ఎకరాల సేకరణకు రూ.7,508.19 కోట్లు అవసరమని.. 99,532 మంది నిర్వాసితుల పునరావాసానికి రూ.20,547.11 కోట్లు అవసరమంటూ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచేసింది. ఈ మేరకు ఇటీవల పంపిన ప్రతిపాదనలపై నిపుణుల కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భూసేకరణ, నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయాన్ని రూ.2,934.41 కోట్ల నుంచి రూ.32,292.24 కోట్లకు పెంచడంపై నివ్వెరపోయింది. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం వల్ల ప్రాజెక్టు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

పనుల నాణ్యతపై నిర్ధారణకు రాలేం
రాష్ట్ర ప్రభుత్వం ముందే ఎంపిక చేసిన పనుల వద్దకు తమను తీసుకెళ్లిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల పనుల నాణ్యతపై నిర్ధారణకు రాలేమని స్పష్టం చేసింది. కుడి, ఎడమ కాలువల పనుల్లో నిర్మాణాల డిజైన్లకు సీడబ్ల్యూసీ నుంచి ఆమోదం తీసుకోలేదని స్పష్టం చేసింది. మిగిలిపోయిన పనులకు సీడబ్ల్యూసీ అనుమతి తప్పకుండా తీసుకోవాలని సూచించింది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రంపైనా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిపుణుల కమిటీ తప్పుపట్టింది. ఈ కేంద్రం పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో వెల్లడించలేదని పేర్కొంది.

కేంద్రం అప్రమత్తం
నిపుణుల కమిటీ నివేదిక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టం కావడంతో తానే రంగంలోకి దిగింది. పనులను వేగవంతం చేయడానికి వీలుగా డిజైన్లను ఖరారు చేయడం కోసం ఈ నెల 7న ఏబీ పాండ్య కమిటీని పోలవరానికి పంపింది. కాఫర్‌ డ్యామ్‌ డిజైన్లను ఖరారు చేసేందుకు నేషనల్‌ వాటర్‌ అండ్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బల్‌రాజ్‌ జోషీ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం, శనివారం పోలవరం పనులను పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేయనుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement