కోయంబత్తూరులో ‘అమ్మ’ విగ్రహం

4 Dec, 2017 02:55 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కోయంబత్తూరులో ఆదివారం తొలి విగ్రహం ఏర్పాటైంది. ఈ విగ్రహాన్ని నగరాభివృద్ధిశాఖ మంత్రి ఎస్పీ వేలుమణి ఏర్పాటు చేయించారు. ‘అమ్మ’ మరణించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ఆమెకు విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మెరీనా తీరంలో స్మారక మందిరం నిర్మాణం తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కోయంబత్తూరులో ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి.

ఇందుకోసం మంత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయించారు. కోయంబత్తూరు–అవినాశి మార్గంలో శనివారం సాయంత్రం వరకు దివంగత సీఎం అన్నాదురై విగ్రహం మాత్రమే ఉండగా ఆదివారం ఉదయాన్నే ఎంజీఆర్, జయలలిత నిలువెత్తు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన వేడుకలో ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి పళనిస్వామి ఆవిష్కరించారు. ఈ మూడు కాంస్య విగ్రహాలు ఒకే ఎత్తులో, ఒకే వర్ణంతో, ఒకే బరువుతో ఏర్పాటు చేయడం విశేషం. 

మరిన్ని వార్తలు