‘వడ్డీభారం’పై ఇంటింటికీ కాంగ్రెస్‌ | Sakshi
Sakshi News home page

‘వడ్డీభారం’పై ఇంటింటికీ కాంగ్రెస్‌

Published Mon, Dec 4 2017 2:56 AM

congress on runa mafi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రుణమాఫీపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మోసం, వడ్డీభారం గురించి ప్రతీ రైతు ఇంటికి వెళ్లి కలవాలని టీపీసీసీ తీర్మానించింది. ఈ అంశంతోపాటు రైతు సమస్యలపై ఆదివారం టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలకు వివిధ సూచనలు చేశారు. రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా చేయాలని నిర్ణయించారని, దీనివల్ల రైతులపై వడ్డీభారం పెరిగిందని ఉత్తమ్‌ వివరించారు.

దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ నిలదీయడంతో ప్రభుత్వం దిగివచ్చిందని, వడ్డీ మాఫీకి హామీ ఇచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించి, రుణమాఫీ సమస్యలు, వడ్డీ భారంతో ఇబ్బందులు పడుతున్న బాధిత రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు, కలెక్టర్లకు అందించాలని కోరారు. ప్రతీ రైతు ఇంటికి వెళ్లి కలవాలని, ప్రత్యేకమైన నమూనాలో జిల్లా అధికారులకు సమాచారం అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

మార్కెట్లకు వెళ్లండి...  
పంటలకు మార్కెట్లలో గిట్టుబాటు ధరలు రావడం లేదని, కాంగ్రెస్‌ నాయకులు వ్యవసాయ మార్కెట్లను సందర్శించి రైతులకు సాయంగా నిలవాలని ఉత్తమ్‌ సూచించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడం లేదని, మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడం లేదని, అలాగే పంటలను అమ్ముకున్న రైతులకు నగదు ఇచ్చే విషయంలో కూడా మార్కెట్లలో చాలా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులను నేరుగా కలసి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై పార్టీపరంగా పోరాడాలని, రైతులకు అండగా ఉండాలని ఆయన సూచించారు.  

కృతజ్ఞతా దినోత్సవంగా సోనియా జన్మదిన వేడుకలు
గతంలో డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం తొలుత ప్రకటించిందని, అదే రోజు సోనియా గాంధీ జన్మదినం కావడంతో తెలంగాణ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని టీపీసీసీ తీర్మానించిందని ఉత్తమ్‌ తెలిపారు. డిసెంబర్‌ 9న ప్రతీ వాడలో సోనియా గాంధీ జన్మదిన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీఏసీ చైర్‌పర్సన్‌ జె.గీతారెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, మల్లు రవి, కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, డీసీసీల అధ్యక్షులు, రాష్ట్రపార్టీ నేతలు పాల్గొన్నారు.    


కొత్త ఓటర్లను చేర్పించండి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితాకు సవరణలు చేస్తున్నారని, ఈ సందర్భంగా కొత్త ఓటర్లను చేర్పించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఉత్తమ్‌ ఆదేశించారు. ఓటర్ల జాబితా విషయంలో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీనాయకులు కమలాకర్‌రావు, శ్యామ్‌ మోహన్, నిరంజన్‌ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసినట్టుగా ఉత్తమ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్ల(ఈవీఎం) ద్వారా అధికారంలో ఉన్న పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

ట్యాంపరింగ్‌ చేసి ఎవరికి ఓట్లు వేసినా అధికారంలో ఉన్నవారి గుర్తులకే ఓట్లు పడే విధంగా సాంకేతికమార్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈవీఎంల వల్ల రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని, ఏ ఎన్నికలు జరిగినా బ్యాలెట్‌ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలోనూ సోషల్‌ మీడియా సమన్వయకర్తలను నియమించుకోవాలని అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement