ఇదీ సోషల్‌ మీడియా చేసిన 'న్యాయం'

22 Feb, 2018 19:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లోహిత్‌ జిల్లా నాంగో మిషిమి గ్రామంలో ఫిబ్రవరి 12వ తేదీన ఐదేళ్ల పాప అదశ్యమైంది. వారం రోజుల తర్వాత తల నుంచి వేరైన ఆ పాప మొండెం ఆ పాప ఇంటికి 300 మీటర్ల దూరంలోని తేయాకు తోటలో దొరికింది. పాపను రేప్‌ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి ఆ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అదే రోజు అంటే ఫిబ్రవరి 18, ఆదివారం రోజు సాయంత్రం సంజయ్‌ సోబర్‌ అనే 30 ఏళ్ల యువకుడిని, జగదీష్‌ లోహర్‌ అనే పాతికేళ్ల యువకుడిని పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారిని జిల్లా కేంద్రమైన తేజు పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితులు ఇద్దరు తేయాకు తోటల్లో పనిచేయడానికి వలస వచ్చిన వాళ్లు. 

సోబర్‌ అనే యువకుడు ఆ పాపను రేప్‌ చేసినట్లు లోహర్‌ అనే యువకుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ మరుసటి రోజు, అంటే సోమవారం సోషల్‌ మీడియా ద్వారా జిల్లా అంతటా పాకింది. మధ్యాహ్నానికి ఇనుప రాడ్లు, కర్రలు, సుత్తెలు పట్టుకొని దాదాపు 1500 మంది ప్రజలు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. రేపిస్టులను తమకు అప్పగించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. అందుకు పోలీసులు అప్పగించక పోవడంతో పోలీసు స్టేషన్‌పై దాడిచేసి లాకప్‌ తాళాన్ని పగులగొట్టి ప్రజలు నిందితులను పట్టుకెళ్లారు. పట్టణంలో వారిని కొట్టుకుంటూ, తన్నుకుంటూ తిప్పారు. చివరకు నిందితులిద్దరు చనిపోయారు. వారి భౌతిక దేహాలను తగులబెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 

ఈ మత్యుదండన సీన్లను కూడా సోషల్‌ మీడియా విపరీతంగా షేర్‌ చేసుకొంది. 'ఇది మూకుమ్మడి న్యాయం....ప్రజల తీర్పు.....ప్రజల న్యాయం.....రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి ప్రజలిచ్చిన బహుమతి' అంటూ పలువురు మెచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ మాత్రం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. 

'రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధతతో కట్టుబడే గొప్ప దేశానికి మనం పౌరులం. చట్టాన్ని చేతుల్లోకి మనం తీసుకోవడాన్ని మన దేశం అనుమతించదు. అందుకు పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. ఆ రెండు వ్యవస్థలను మనం గౌరవించాలి' అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలు ఈ సంఘటనపై ఇంతవరకు స్పందించలేదు. 
అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం మాత్రం ఖండించింది. 'భారత దేశంలో బాలికలు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస అంతా, ఇంతా కాదు. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. అంతమాత్రాన ప్రజలు హింసకు పాల్పడరాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టాలను గౌరవించాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రేపిస్టులను చంపిన వారిని కూడా చట్టం ప్రకారం శిక్షించాల్సిందే' అని పౌర హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడే అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం వ్యాఖ్యానించింది. ప్రజలు ఇంతగా ఆగ్రహానికి గురికావడానికి కారణం అస్సాంలో రేప్‌లు ఎక్కువగా జరుగుతుండడం, వాటిల్లో నేరస్థులకు సరిగ్గా శిక్షలు పడక పోవడం కారణమని కొందరు విజ్ఞులు వాదిస్తున్నారు. 

రాష్ట్రంలో 2015 నుంచి 2017, నవంబర్‌ నెల వరకు 225 రేప్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క 2016లోనే 91 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో నెలలు, నెలలు గడుస్తున్నా నిందితుల అరెస్ట్‌లు కూడా జరుగలేదు. రాష్ట్ర రాజధాని ఇటా నగర్‌కు సమీపంలో గత ఆగస్టు నెలలో ఓ యూనివర్శిటీ విద్యార్థిని శవం దొరికింది. ఆమెను రేప్‌ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇంతవరకు ఆ కేసులో ఎవరిని అరెస్ట్‌ చేయలేదు. ఇదే ఫిబ్రవరి కేసులో రెండు రేప్‌ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన సియాంగ్‌ జిల్లాలోని యింకియాంగ్‌లో ఐదేళ్ల బాలికను ఆమెకు పాఠాలు చెప్పే టీచరే రేప్‌ చేసినట్లు కేసు నమోదయింది. 14వ తేదీన సుభాన్‌సిరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికను రేప్‌ చేశారు. ఈ సంఘటనలో 23 ఏళ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలే పట్టుకొని ఊరంతా తిప్పి పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు