పంచ పాండవుల్లో పళనిస్వామి ఒకరు

16 Feb, 2017 17:06 IST|Sakshi
పంచ పాండవుల్లో పళనిస్వామి ఒకరు

చెన్నై:
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి కే. పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి జయలలిత నమ్మిన ఐదుగురు ప్రధాన బంటుల్లో ఒకరు. పన్నీర్‌సెల్వం, నాథమ్‌ ఆర్‌. విశ్వనాథన్, వి.వైతిలిలింగమ్, పీ. పళనియప్పన్, పళనిస్వామిలు అమ్మకు అన్ని విధాల అండగా ఉంటూ పార్టీని నడిపించడంలో ముందున్న పంచ పాండవులు.

భూస్వామి కుటుంబంలో పుట్టిన పళనిస్వామి ఏఐడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్‌కున్న ప్రతిష్టను చూసి ఆకర్షితుడై 1982లో పార్టీలో చేరారు. 1987లో ఎంజీ రామచంద్రన్‌ చనిపోయినప్పుడు ఆయన వారసురాలిగా జానకి రామచంద్రన్‌ను కాదని, జయలలితను గట్టిగా సమర్థించారు. ఫలితంగా 1989లో మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం లభించింది. జయలలితకు తన మంత్రివర్గాన్ని తరచూ పునర్‌ వ్యవస్థీకరించడం అలవాటు. ఎక్కువ మందిని తొలగిస్తూ కొత్తవారిని తీసుకుంటారు. 2011 నుంచి 2016 వరకు ఒక్కసారి కూడా మంత్రివర్గం నుంచి వేటు పడని చాలా తక్కువ మందిలో పళనిస్వామి ఒకరు.

పార్టీ తరఫున రాజకీయ పొత్తుల వ్యవహారాలన్నింటిని పళనిస్వామి స్వయంగా చూసుకునేవారు. అమ్మ తరఫున మిత్రపక్షాలతో చర్చలు జరిపేవారు. 2016లో ఎన్నికల పొత్తు గురించి చర్చలు జరిపేందుకు జయలలిత పన్నీర్‌ సెల్వంను పూర్తిగా పక్కనబెట్టి పూర్తి బాధ్యతలను పళనికే అప్పగించారు. ఆయన పార్టీ కార్యకలాపాల్లో విజయం సాధించడానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కొంగు వెల్లాల గౌండర్‌’ కులం ప్రభావం కూడా ఎంతో ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే పశ్చిమ తమిళనాడులో అఖండ విజయం సాధించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ ప్రాంతంలోని 55 సీట్లకుగాను 45 సీట్లను పార్టీ గెలుచుకుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సేలం ప్రాంతంలో 11 సీట్లకుగాను 10 సీట్లలో పార్టీ విజయం సాధించడంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత మరింత పెరిగింది.

డిసెంబర్‌ 5వ తేదీన జయలలిత మరణించినప్పుడు ముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం నామినేషన్‌ను పళనిస్వామి వ్యతిరేకించినట్లు వార్తలొచ్చాయి. అప్పుడే పళనిస్వామి శాసనసభాపక్ష నాయకుడిగా పార్టీ ఎన్నుకొని ఉంటే పార్టీలో సంక్షోభం ఏర్పడే ఆస్కారం ఉండేది కాదన్నది కూడా కొంత మంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఒక్కసారి పళనిస్వామికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే తిరిగి తీసుకోవడం సాధ్యపడదని భావించిన చిన్నమ్మ శశికళ ఉద్దేశపూర్వకంగా తాత్కాలిక ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీర్‌ సెల్వంకు అప్పగించారన్న వాదన కూడా ఉంది. చివరకు ఎలాగు సుప్రీం కోర్టు తీర్పు కారణంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో చిన్నమ్మ, పన్నీర్‌ సెల్వంను దెబ్బతీయడానికి పళనిస్వామిని ఎంపిక చేశారు.

సౌమ్యుడిగా ఉండే పన్నీర్‌సెల్వంకు కార్యనిర్వాహక రంగంలో బలహీనుడిగా ముద్రపడగా, పళనిస్వామికి మృధుభాషి, సౌమ్యుడే కాకుండా మంచి పాలనాదక్షుడనే ముద్ర కూడా ఉంది.

మరిన్ని వార్తలు