రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్

17 Aug, 2015 14:28 IST|Sakshi
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్

ముంబై: తనది అపర కాళీకాదేవి అవతారమంటూ వివాదాస్పద ఆహార్యం, ప్రవర్తనతో సంచలనం సృష్టిస్తోన్న రాధే మాకు మద్దతుగా బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్‌సైట్లో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని సృష్టిస్తున్నాయి. 'కురచ దుస్తులు ధరించారంటూ రాధేమాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారుగానీ మరి అదే కాళికాదేవి అంతకన్న తక్కువ దుస్తుల్లో కనిపిస్తారు గదా! మరి ఆ సంగేతేమిటి ? అసలు బట్టలంటూ ధరించకుండా నగ్నంగా సంచరించే, అసభ్యంగా నృత్యం చేసే సాధు పుంగవుల సంగతేమిటీ?' అంటూ సోను నిగమ్ ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం ద్వారా కొత్త వివాదాన్ని రాజేశారు.

'ఆడవాళ్లకో న్యాయం, మగవాళ్లకో న్యాయమా?' అంటూ సోనూ నిగమ్ మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. కుంభమేళా లాంటి కార్యక్రమాల్లో కొన్ని తెగల సాధువులు నగ్నంగా సంచరించినా, జుగుస్పాకరంగా నృత్యం చేసినా పట్టించుకోరని, వారిపై అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారని, మరి ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా? అంటూ కూడా ఆయన విమర్శకులను సూటిగా  ప్రశ్నించారు.

భగవత్ స్వరూపిణీగా, అపర కాళీమాతాగా ప్రచారం పొందుతున్న రాధే మాపై కేసులు వేయడం న్యాయం కాదని, ఆమెను అలా చిత్రీకరిస్తున్నవారిపై, ఆమెను అలా కొలుస్తున్న భక్తజనంపై ఈ సమాజం, ఈ వ్యవస్థ కేసులు వేయాలని సోనూ నిగమ్ మరో ట్వీట్‌లో సూచించారు. కురచ దుస్తులు ధరిస్తూ, భక్తులను కౌగిలింతలు, ముద్దులతో ముంచెత్తుతూ దేవతలను అవమానపరుస్తున్నారంటూ హిందూ సంస్థలు గొడవ చేస్తున్న విషయం తెల్సిందే.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ ముంబైకి చెందిన న్యాయవాది ఫాల్గుని బ్రహ్మభట్ కేసు కూడా వేశారు.   మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్, కురచ దుస్తుల్లో వున్న రాధే మా ప్రైవేట్ ఫొటోలను ఆగస్టు ఐదవ తేదీన మీడియాకు విడుదల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అవి పూర్తిగా తన ప్రైవేట్ ఫొటోలని, ఇంట్లో ఎవరైనా అలాంటి దుస్తులు ధరించవచ్చని, దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆమె మీడియా ముందు సమర్థించుకోవడం విశేషం.

 

మరిన్ని వార్తలు