60 మంది చిన్నారుల మృతికి అతను కారణం కాదు

27 Sep, 2019 15:52 IST|Sakshi

లక్నో: విధుల్లో నిర్లక్ష్యం వహించి 60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారనే నెపంతో జైలు శిక్ష అనుభవించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునికి భారీ ఊరట లభించింది. రెండేళ్ల అనంతరం అందులో ఆ వైద్యుని తప్పేమీ లేదని విచారణ కమిటీ తేల్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బీఆర్‌డీ కాలేజ్‌లో 2017 ఆగస్టులో ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో 60 మందికి పైగా చిన్నారులు మరణించారు. అయితే ఇందుకు చిల్ట్రన్స్‌ డాక్టర్‌ కఫీల్ ఖాన్ నిర్లక్ష్యమే కారణమని భావించి అతన్ని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలో కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తొమ్మిది నెలల పాటు జైలులో గడిపిన అనంతరం కఫీల్‌ ఖాన్‌కు​ ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. 

తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. కఫీల్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ ఘటనలో అతని నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని తెలిపింది. అతనిపై ఉన్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. ఈ మేరకు సీనియర్‌ ఐఏఎస్‌ హిమాన్ష్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కఫీల్‌ స్పందిస్తూ.. తను హంతకుడనే ముద్ర తొలగిపోయిందని అన్నారు. ఆక్సిజన్‌ అందక మరణించిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం వేచిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు