ఆమె బుర్రలేని కలెక్టర్‌ : ఎమ్మెల్యే

11 Feb, 2019 10:51 IST|Sakshi

తిరువనంతపురం : అక్రమ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని బుర్ర లేదంటూ సీపీఎం నాయకుడు అవమానించారు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటన విజువల్స్‌ ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతుండటంతో సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మున్నార్‌ హిల్‌ స్టేషన్‌లో ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ భవన నిర్మాణాన్ని అడ్డుకున్నారు సబ్‌ కలెక్టర్‌ రేణు రాజ్‌.

ఆమె చర్యలను వ్యతిరేకించిన సీపీఎం ఎమ్మెల్యే ఎస్‌ రాజేంద్రన్‌ ఓ ప్రజా కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ను ఉద్దేశిస్తూ ‘ఆమెకు బ్రెయిన్‌ లేదు.  పంచాయతి నిర్మాణ పనుల్లో ఒక కలెక్టర్‌ జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. ఇంత చిన్న విషయం ఆమెకు తెలియకపోవడం దారుణం. వీళ్లంతా కేవలం కలెక్టరు పోస్టోకు అర్హత సాధించే చదువులను మాత్రమే చదువుతారు. వారి బుర్ర కూడా అలానే ఉంటుంది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వారు ఉండటం మన ఖర్మ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్‌ టీవీల్లో ప్రసారం కావడంతో రాజేంద్రన్‌ వ్యాఖ్యల పట్ల వివాదం చేలరేగుతోంది. ఈ విషయం గురించి సబ్‌ కలెక్టర్‌ రేణు మాట్లాడుతూ.. ‘అక్రమ నిర్మాణాన్ని ఆపండంటూ ఈ నెల 6న సదరు పంచాయతీ అధికారులకు మెమో కూడా జారీ చేశాం. కానీ వారు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే వారి మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు. ఈ వివాదంలో రెవెన్యూ మినిస్టర్‌ చంద్రశేఖరన్‌ కూడా రేణుకు మద్దతు తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ తీసుకున్న చర్యలు చట్టబద్దమైనవే అన్నారు.

మరిన్ని వార్తలు