ఆ హక్కు మీకు లేదు!

6 Feb, 2018 02:28 IST|Sakshi

సామాజిక నైతికత కాపాడే బాధ్యత మీది కాదు

ఖాప్‌ పంచాయతీలపై మండిపడ్డ సుప్రీం

న్యూఢిల్లీ: సమాజంలో నైతికతను కాపాడటమే తమ బాధ్యతనే విధంగా ఖాప్‌ పంచాయతీలు వ్యవహరించ కూడదని సుప్రీం కోర్టు మండిపడింది. ఇద్దరు మేజర్ల వివాహాన్ని చట్టమే నిర్ధారిస్తుందని పేర్కొంది. వివాహాల విషయంలో ఖాప్‌ పంచాయతీల జోక్యంపై విచారించేందుకు సీనియర్‌ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ‘ఓ పెళ్లి సరైనదా? కాదా? అనే అంశాన్ని చట్టమే నిర్ణయిస్తుంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మీరు (ఖాప్‌ పంచాయతీలు) సమాజంలో నైతికతను కాపాడాల్సిన పనిలేదు’ అని ధర్మాసనం పేర్కొంది.

పరువు హత్యలపై ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే కుటుంబానికి (సపిండ) చెందిన వారు పెళ్లిచేసుకోకూడదు. సమాజంలో నైతిక విలువలను కాపాడేలా ఖాప్‌ పంచాయతీలు పనిచేస్తున్నాయి’ అని ఖాప్‌ పంచాయతీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దు: దీనిపై సుప్రీం స్పందిస్తూ.. ‘ఇద్దరు యువతీ యువకుల మధ్య పెళ్లి వారి వ్యక్తిగతం. దీనిపై చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయాలపై ఖాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని పేర్కొంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

796 శాతం పెరిగిన పరువు హత్యలు!
2014–15లో పరువు హత్యలు దేశవ్యాప్తంగా 796 శాతం పెరిగాయి. 2014లో 28 పరువుహత్యల ఘటనలు చోటుచేసుకోగా.. 2015లో ఈ సంఖ్య 251కి పెరిగింది. ఈ  జాబితాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. పది పదిహేను మంది సభ్యులుండే ఖాప్‌ పంచాయతీలు కోర్టులకు చేరని తమ సామాజికవర్గానికి చెందిన గొడవలను విచారణ ద్వారా పరిష్కరిస్తాయి.

మరిన్ని వార్తలు