అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం

5 Jul, 2017 19:49 IST|Sakshi
అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం

బెంగళూరు:
ఇద్దరూ వరుసకు అక్కచెల్లెళ్లు. వావివరసలు మరిచారు. నేటి ఆధునిక పోకడల్లో ఒకటైన ‘లెస్బియన్‌’లయ్యారు. ప్రేమపేరుతో దగ్గరై పెళ్లి కూడా చేసుకున్నారు. వారి తల్లిదండ్రులు ఇదెక్కడి ఘోరమంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ రసకందాయంలో పడింది. భారత ఐటీ రాజధాని బెంగళూరులోని విజయనగర్‌ ఈ విడ్డూరానికి వేదికైంది. చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లల్లోనే కలిసి పెరిగారు. బంధువులైన వారిద్దరూ వరుసకు అక్క, చెల్లెలు. వీరిలో ఒకరు ప్రైవేటు కాలేజీలో బీ.కాం చదువుతుండగా, మరొకరు కాల్‌సెంటర్‌లో ఉద్యోగిని.

రెండేళ్ల నుంచి ఇద్దరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. బీకాం విద్యార్థిని అబ్బాయిలాగ ప్రవర్తిస్తూ కాల్‌సెంటర్‌ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఒత్తిడి చేస్తూ వచ్చింది. మొదట కాల్‌సెంటర్‌ ఉద్యోగిని ఆమె ‍ప్రవర్తనను చూసి తమాషా చేస్తోంది అనుకుంది. అయితే కొంతకాలానికి ప్రేమను అంగీకరించింది. అప్పటి నుంచి ప్రేమికుల్లాగా షాపింగ్‌మాల్స్, సినిమాలు, షికార్లు, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించారు. తమ ప్రేమను ఇళ్లల్లో అంగీకరించరని తెలుసుకుని ఈ ఏడాది మే నెలలో ఇంట్లో నుంచి పారిపోయి గుళ్లో పెళ్లి చేసుకుని, కోరమంగళలో అద్దె ఇంట్లో సహజీవనం చేయసాగారు.

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
బీకాం విద్యార్థిని తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని విజయనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి సహజీవనం తతంగాన్ని తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిద్దరూ మేజర్లని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నందున తామేం చేయలేమని పోలీసులు అమ్మాయిల తల్లిదండ్రులకు స్పష్టంచేశారు. ఈలోగా తమను విడదీస్తారేమోనని భయపడ్డ జంట.. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను, లాయర్లను కలసి న్యాయం చేయాలని కోరింది. తల్లిదండ్రులు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని వనితా సహాయవాణిని ఆశ్రయించడంతో సీనియర్‌ కౌన్సిలర్‌ బీ.ఎస్‌.సరస్వతి ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఇండియాలో స్వలింగ సంపర్కం నేరమని, అయితే బాధితులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదవుతుందని నిపుణులు తెలిపారు.

మరిన్ని వార్తలు