ప్రారంభం..ఆ వెంటనే వాయిదాలు..

22 Jul, 2015 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు రెండోరోజు కూడా అదే తంతు కొనసాగింది. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి.  విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే వాయిదా పడింది.  ఈరోజు  లోక్ సభ ప్రారంభం కాగానే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మృతి చెందినవారికి  ఆత్మకు శాంతి చేకూరాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానం చదివి వినిపించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.

అనంతరం విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించినట్లు ప్రకటించగానే విపక్ష సభ్యులు లలిత్ మోదీ అంశాన్ని లేవనెత్తారు. అయితే సభ్యులు ఫ్లేకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ సూచించారు. అయినా సభ్యులు తమ ఆందోళనను విరమించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.   మరోవైపు కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగుతోంది. వ్యాపం కుంభకోణంపై చర్చకు సభ్యులు పట్టుబడుతున్నారు. చర్చకు అనుమతిచ్చేది లేదని రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ స్పష్టం చేశారు. గందరగోళం నెలకొనటంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు