ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

7 Aug, 2018 02:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు–2018ను సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ సభలో ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు విధించిన నియంత్రణల కారణంగా ఆర్టికల్‌–18 ప్రాముఖ్యత కోల్పోయిందని మంత్రి గెహ్లాట్‌ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు.

ఈ ఆలస్యం దళితుల్లో అసహనం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆర్టికల్‌–18కి సవరణలు చేపట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందనే సాకుతో 88శాతం మంది దళితులను ఇబ్బందులు పడనివ్వబోమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్‌ను ఏ కోర్టూ ఇవ్వరాదనే నిబంధనను బిల్లులో చేర్చారు. క్రిమినల్‌ కేసు నమోదు చేయకున్నా, ఎవరి అనుమతి తీసుకోకుండానే అరెస్టులు చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది.

మరిన్ని వార్తలు