‘రాహుల్‌ గాంధీ’ పేరుతో తంటాలు పడుతున్న యువకుడు

30 Jul, 2019 18:12 IST|Sakshi

భోపాల్‌: అభిమాన నాయకుడు, హీరో, హీరోయిన్లు, నచ్చిన దేవతల పేర్లు పిల్లలకు పెట్టడం మన దేశంలో చాలా సహజం. అయితే కొన్ని సార్లు ఇష్టంగా పెట్టుకున్న పేరు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్‌ పార్టీ మీద అభిమానమో.. లేక ఇతర కారణమో తెలీదు కానీ.. ఇండోర్‌, అఖండ్‌ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కుటుంబ సభ్యులు రాహుల్‌ గాంధీ అని పేరు పెట్టారు. అది కాస్త అతని పాలిట శాపమయ్యింది. దాంతో ఈ యువకుడికి బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే కాక ఒక్క టెలికాం కంపెనీ కూడా అతని పేరు మీద సిమ్‌ ఇవ్వడానికి అంగీకరించలేదట.

అంతేకాక ఈ పేరు వల్ల చాలాసార్లు తాను అవమానాల పాలయ్యానని వాపోతున్నాడు ఈ మధ్యప్రదేశ్‌ ‘రాహుల్‌ గాంధీ’. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘లోన్‌ కోసం ఓ సారి బ్యాంక్‌కు వెళ్లాను. నా పేరు రాహుల్‌ గాంధీ అని చెప్పాను. దాంతో ఆ బ్యాంక్‌ అధికారి నవ్వుతూ.. రాహుల్‌ గాంధీ ఢిల్లీ నుంచి ఇండోర్‌ ఎప్పుడు షిప్ట్‌ అయ్యారని ప్రశ్నించాడు. నిజంగానే నా పేరు రాహుల్‌ గాంధీ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. పైగా నకిలీ పత్రాలతో మోసం చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. ఇలా అయితే లాభం లేదని భావించి నా పేరు మార్చుకున్నాను. రాహుల్‌ గాంధీ బదులు రాహుల్‌ మాలవియా అని పెట్టుకున్నాను. మా సామాజిక వర్గంలో మాలవియా అనే పేరు చాలా సహజం. ఇక ముఖ్యమైన డాక్యుమెంట్లలో కూడా మాలవియాగానే మార్చుకున్నాను’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు